మా పార్టీ సర్పంచ్ అవినీతి ఇదే! వైసీపీ నేత ఫ్లెక్సీ కలకలం..
Published on: Mon Dec 27, 2021 7:57AM
సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య అవినీతిపై సవాళ్లు నడుస్తుంటాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. కాని ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. తమ పార్టీ నేతల అవినీతిపై సొంత పార్టీ కార్యకర్తలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. వైసీపీ సర్పంచ్, పంచాయతీ అధికారుల అవినీతిపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. అవినీతి అధికారులు వీరేనంటూ ఏకంగా ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని వేండ్ర పంచాయతీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
పంచాయతీలో పదేళ్లుగా అవినీతి పేరుకుపోయిందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వైసీపీ వార్డు సభ్యుడు కుక్కల సాయికృష్ణతోపాటు మరికొందరు గ్రామస్థులు కలిసి పంచాయతీ అధికారుల అవినీతి జాబితా ఇదేనంటూ గ్రామంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మోగల్లు పంచాయతీలో పనిచేస్తున్న కాటూరి రవికుమార్ పంచాయతీ నిధులను అదే గ్రామానికి చెందిన దిలీప్ ఖాతాలోకి మళ్లించారని ఈ సందర్భంగా సాయికృష్ణ ఆరోపించారు. దీని వెనక వేండ్ర పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేంద్ర, ప్రస్తుత వైసీపీ సర్పంచ్ ఉన్నారని ఆరోపించారు. సర్పంచ్, పంచాయతీ అధికారుల అవినీతిపై ఏసీబీతో విచారణ చేయించాలని వైసీపీ కార్యకర్త సాయికృష్ణ డిమాండ్ చేశారు.


