అదే జగన్ కాన్ఫిడెన్సు.. ఐదు సర్వేల్లోనూ వందకి పైగా సీట్లు

 

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో ఈ నెల 23 న తేలనుంది. అయితే ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని వైసీపీ బలంగా నమ్ముతోంది. విశ్లేషకులు కూడా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే తేలిందట. ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు ఇలా ఎవరెవరు ఎవరికి ఓటు వేశారన్న అంశంపై వర్గాల వారీగా ఐదు రకాల సర్వేలు చేయించి, వాటన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషించారని తెలుస్తోంది. అన్ని సర్వేల్లోనూ టీడీపీ కంటే వైసీపీ ఎన్నో అంశాల్లో ముందు ఉన్నట్లు తేలడంతో గెలుపుపై జగన్‌ కు మరింత నమ్మకం పెరిగిందని అంటున్నారు.

జగన్ చేయించిన సర్వేల ప్రకారం.. వైసీపీకి ఖచ్చితంగా 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలిందని సమాచారం. ఈ 100 సీట్లకు పైనే వస్తాయి తప్ప, ఒక్కటి కూడా తగ్గదని తేలడం వల్లే జగన్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఏపీలో ఉన్న మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను.. వైసీపీకి ఖచ్చితంగా 18 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందట. అందువల్ల జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు కూడా వీలవుతుందని జగన్ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. 100 సీట్లు వస్తాయని తెలిసినా మిగతా 75 స్థానాల్లో ఎందుకు వైసీపీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న దానిపై జగన్ లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత రాలేదనీ, ఆ పార్టీ ఇంకా బలంగానే ఉందనీ సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. కోస్తా జిల్లాల్లో వైసీపీ బలపడినా, జనసేన ప్రభావం కొంతవరకూ కనిపిస్తోందనీ, అందువల్ల వైసీపీ గెలిచే అవకాశాలున్న చోట్ల జనసేన ఓట్లను చీల్చిందని సర్వే నిర్వాహకులు జగన్‌కు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి జగన్ చేయించుకున్న ఐదు సర్వేల్లోనూ వైసీపీకి 100 కి పైగా సీట్లొస్తాయని తేలడంతోనే జగన్ గెలుపుపై అంత నమ్మకంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.