Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ పంచాయతీలు.. పెదరాయుడి పాత్రలో జగన్
posted on: Jun 21, 2022 2:20PM
ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ఫ్యాలెస్ ఇప్పుడు పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతే.. ఆ పంచాయతీలు విని తీర్పులు ఇచ్చే పెదరాయుడి పాత్రలో జగన్ జీవిస్తున్నారట. నిన్న మొన్నటి వరకు జగన్ మలి కేబినెట్ కూర్పులో భాగంగా.. పదవి పోయిన మాజీలను, పదవి రానీ అసమ్మతీయులను బుజ్జగించి దారికి తెచ్చుకునే పనిలో బిజీబిజీగా గడిపిన జగన్ ఇప్పుడు కొంచం ఊపిరి పీల్చుకుందామనుకునే సరికి కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి.
ఒకటా రెండా.. మొత్తం 13 జిల్లాలు.. లోక్ సభ స్థానాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం. దీంతోనే అసలు సమస్య రాజుకొందని పార్టీ నేతలు అంటున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు.. ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో పార్టీ అధినేత జగన్ సతమతమౌతున్నారని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. జిల్లాల మార్పుతో అనవసర తలనొప్పులు తెచ్చుకున్నట్లైందని మధన పడుతున్నారుని అంటున్నారు. బీసీ సామాజిక న్యాయ భేరి పేరిట 17 మంది మంత్రులతో కూడిన బస్సు యాత్ర ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. కానీ ఈ యాత్ర తుస్సుమంది. అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా నిరసన సెగ తీవ్రంగా తగిలింది.
దీంతో రాష్ట్రంలో పార్టీ రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయా అన్న అనుమానం వైసీపీ అధినేతలోనే మొదలైందంటున్నారు. దీంతో పార్టీలో ఎక్కడ అసంతృప్తి ఉందని పించినా అక్కడి వర్గాలను తాడేపల్లికి పిలిపించి బుజ్జగించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వర రెడ్డి తనయుడికి.. ఆయన సోదరుడి కుమారుడికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని సమాచారం. దీంతో వారిని తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని పంచాయతీ పెట్టి తీర్పిచ్చేశారు జగన్. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పని అయిపోవడం, ఇదే జిల్లాలోని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంపైపు చూపు సారించడం, ఆమె కుమార్తె కైవల్యా రెడ్డి భర్తతో కలిసి ఒంగోలు వేదికగా ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిసి.. మంతనాలు జరపడంతో జిల్లాలో ఇతర పార్టీ ప్రముఖులను తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడిన జగన్, ప్రసన్న కుమార్ రెడ్డిని సైతం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతుండటంతో ఆయనను సైతం తాడేపల్లి పిలిపించి మాట్లాడే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మంత్రి విడదల రజనీ వర్సెస్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వర్గాలు ఒకరిపై ఒకరు కారాలూ, మిరియాలూ నూరుకుంటున్న పరిస్థితి. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరిల మధ్య పంచాయతీ తెలిసిందే. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పంచాయతీని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ నిర్వహించాల్సిన పరిస్థితి. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్.. బుల్లితెర సీరియల్‌లాగా ఎప్పుటి నుంచో కొన.. సాగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అసమ్మతి గళం విప్పడంతో ఆయనపై ఫ్యాన్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకంతో పార్టీ పరువు గోదారిలో కలిసిందనే టాక్ ఉండనే ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీ జెండాపై గెలిచి... వైసీపీలోకి దూకిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాం రాం చెప్పి.. సైలెంట్ అయ్యారు. ఆయన కూడా కుదిరితే సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభకు పంపుతానంటూ ముందే ఉరించి... ఆ తర్వాత ఆవిడను సైతం ఉసురుమనిపించారట. ఇప్పుడీ పంచయతీలన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. పెదరాయుడు స్టైల్ లో తీర్పు చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే బాధ్యత జగన్ దేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.
వీటన్నిటికీ మించి ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీకి మంచి బలం, బలగం కూడా ఉంది. కానీ ఆ జిల్లాలో వైసీపీ క్యాడర్ గంపగుత్తగా తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. అదొ పంచయతీ జగన్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు పంచాయతీ కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరనుంది.






