TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు తత్వం బోధపడిందా?

Published on: Thu Sep 17, 2026 2:44PM

తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే జగన్ తన వైఖరిని ఇప్పుడు మార్చుకుంటున్నారా? మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉత్పన్నం కావడంతో ఆ ప్రాంతంలో పార్టీని కాపాడుకోవడానికి ధిక్కరించిన, ధిక్కరిస్తున్న నేతలను బుజ్జగించడానికి ఆయన స్వయంగా దిగి వచ్చారా? అంటే వరుసగా జరిగిన పరిణామాలను గమనిస్తే ఔనన్న జవాబే వస్తుంది. 

ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు జగన్ లో ఆందోళనరేకెత్తించాయంటున్నారు.  ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీ వీడుతుండటం, మరికొందరు అసంతృప్తి గళం వినిపిస్తుండటంతో జగన్ స్వయంగా ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్ఠం చేయడం కోసం నడుం బిగించారు.  ఈ నేపథ్యంలోనే  అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే.. తన సహజసిద్ధ స్వభావానికి విరుద్ధంగా.. అసంతృప్త నేతలను స్వయంగా తాడేపల్లి ప్యాలెస్ కు ఆహ్వానించి వారితో సంప్రదింపులు జరిపారు. జగన్ లో ఈ మార్పు స్థానిక ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను గమనిస్తూ, , తప్పులను సరిదిద్దే ప్రయత్నం రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూర్చుతుందన్న దానిపై ఇప్పుడు వైసీపీలోనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  

కాగా జగన్ తమ్మినేని, బొత్సలతో వేర్వేరుగా భేటీ అయినా.. ఆ ఇద్దరికీ కూడా 2029 ఎన్నికలలో పార్టీ టికెట్ ఖాయమన్న హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిత్వం తమ్మినేని సీతారాంకే అని హామీ ఇచ్చిన జగన్, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఖరారు చేసినట్లు చెప్పారు.  మొత్తం మీద బొత్స, సీతారాంల విషయంలో జగన్ తన సహజశైలికి విరుద్ధంగా వారిద్దరినీ పార్టీకి దూరం కావద్దనీ, తాను వారి రాజకీయ భవిష్యత్ కు పూచిపడతాననీ బుజ్జగించినట్లు వైసీపీ వర్గాలలోనే విస్తృతంగా ప్రచారం అవుతోంది. 

[YCP Supreme, YS Jagan, North Andhra politics, Botsa Satyanarayana, Tammineni Sitaram, YCP defections, Telugu One, AP News]