వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన జగన్!
Published on: Tue May 17, 2022 2:23PM
ఆంధ్రప్రదేశ్’లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఆ నాలుగూ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా వైసీపీ పరం కానున్నాయి. దీంతో వైసీపీలో రాజ్యసభ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం జగన్ రాజ్యసభకు ముగ్గురి పేర్లను ఖరారు చేశారు. మిగిలిన స్థానం విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక స్థానాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ భార్య ప్రీతీ అదానీకి కేటాయించాలని భావించినా జగన్ ప్రతిపాదనను గౌతమ్ అదానీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
దీంతో రాజ్యసభకు వైసీపీ తరఫున ఎవరెవరిని పంపాలన్న దానిపై జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి మూడు పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రాజ్యసభకు ఖరారు చేసిన వారిలో బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, ఎస్సీ కోటాలో బీద మస్తాన్ రావు పేర్లను సీఎం జగన్ దాదాపు ఖరారు చేశారు. నాలుగో స్థానానికి ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డి పేరును పరిశీలస్తున్నట్లు చెబుతున్నారు.
అయతే ఆ విషయం ఇంకా ధృవపడలేదు. కాగా రాజ్యసభ ఎన్నికల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.


