TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైజాగ్, అనకాపల్లిలోనూ కూల్చివేతలు?

Published on: Sat Jun 22, 2024 11:48AM

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, భవిష్యత్తులో ప్రభుత్వాలు అనుసరించడానికి ఒక మార్గాన్ని సెట్ చేశారు. అదే, ప్రభుత్వం కూల్చేయదల్చుకుంటే దేన్నయినా కూల్చేయవచ్చు. ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికని ప్రభుత్వమే కూల్చేయడాన్ని మించిన గొప్ప విషయం మరొకటి వుంటుందా? ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కూల్చివేతలు ప్రారంభించింది. కాకపోతే జగన్ ప్రభుత్వమంతా అడ్డగోలుగా కాకుండా చట్టప్రకారం కూల్చివేస్తోంది. తాడేపల్లి సమీపంలోని సీతానగరం పరిధిలో వున్న బోట్ యార్డుకు సంబంధించిన రెండెకరాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసుని ప్రభుత్వం చక్కగా కూలగొట్టింది. ఈ కట్టడం అక్రమమని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు ఆ ఫిర్యాదులను పరిశీలించారు. సదరు కట్టడం అక్రమమని తేలడంతో కూల్చేశారు. 

కూల్చివేతల పరంపర తాడేపల్లి ఆఫీసుతోనే ఆగేట్టులేదండోయ్.. విశాఖపట్నంలో నిర్మించిన వైసీపీ ఆఫీసు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదేనట. ఎండాడలోని సర్వేనంబర్ 175/4లో రెండెకరాల స్థలంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేశారని ఫిర్యాదులు అందాయి. దాంతో వైజాగ్ జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి చర్యలు వుంటాయని నోటీసులు జారీ చేశారు. దీనికి వైసీపీ వాళ్ళు ఇచ్చే వివరణ ఎలాగూ సంతృప్తికరంగా వుండదు.. ఎందుకంటే, ఇది అధికార బలంతో అక్రమంగా నిర్మించిన కట్టడం కాబట్టి. అందువల్ల ఈ కట్టడాన్ని కూడా త్వరలో పొక్లెయినర్లు ముద్దాడే అవకాశాలున్నాయి.

అనకాపల్లిలోనూ వైసీపీది ఇదే వరస. జీవీఎంసీ అనుమతి లేకుండా పార్టీ ఆఫీసు పేరుతో ఒక ప్యాలెస్ నిర్మించారు. హైవే సమీపంలో 1.75 ఎకరాలను 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుని, ఏడాదికి వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా సెట్ చేసుకున్నారు. అనుమతుల్లాంటివేవీ అేకుండా భారీ కట్టడం నిర్మించేశారు. దీని మీద కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం అతి త్వరలో దీనికి కూడా స్పాట్ పెట్టే అవకాశం వుంది.