జేసీకి వార్నింగ్ ఇచ్చిన సీఐకి వైసీపీ ఎంపీ టికెట్!!

 

సీఐ గోరంట్ల మాధవ్. కొద్ది రోజుల క్రితం ఈ పేరు వార్తల్లో మారుమోగిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎంపీకే మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడంతో ఈయన పేరు వార్తల్లో బాగా వినిపించింది. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి గొడవలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీఐ మాధవ్ తెరపైకి వచ్చారు. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలని మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

అయితే సీఐ మాధవ్ పేరు ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వినిపిస్తుంది. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారట. జేసీలాంటి వ్యక్తికే సవాల్ విసిరిన మాధవ్‌పై వైసీపీ కన్నేసింది. కదిరి సీఐగా ఉన్న ఆయనతో వైసీపీ పెద్దలు రహస్యంగా మంతనాలు జరిపారట. హిందూపురం ఎంపీగా మాధవ్‌ను పోటీచేసేలా ఒప్పించాలన్నది ఆ సంప్రదింపుల సారాంశం. అందుకు మాధవ్ సైతం ‍ఒప్పుకున్నారని తెలుస్తోంది. సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని వైసీపీ హైకమాండ్ కోరడంతో మాధవ్ అదే పనిలో ఉన్నారు. తన రాజీనామా లేఖను జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీకి పంపారట కూడా!
 
మాధవ్ కురబ సామాజికవర్గానికి చెందినవారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కురబ, యాదవ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అందుకే మాధవ్‌ను బరిలోకి దింపడం ద్వారా టీడీపీకి గట్టిపోటీ ఇవ్వవచ్చని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. బీసీల అండతోనే టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప రెండుసార్లు గెలిచారు. దీంతో టీడీపీ వెంట ఉన్న బీసీలకు గాలం వేయడానికే మాధవ్ పేరును వైసీపీకి తెరపైకి తీసుకువచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అయితే మాధవ్‌ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వకుండా ఆయనను బలిపశువును చేస్తారమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురిని టికెట్ ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకున్న తర్వాత వారికి హ్యాండ్‌ ఇచ్చిన ఘటనలున్నాయి. అందుకే మాధవ్ విషయంలో ఇలా జరుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి మాధవ్‌ వ్యవహారం వచ్చే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో!