బెయిల్ పిటిషన్‌ కోర్టు కొట్టేసింది.. ఈ 'నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో

 

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. సైబర్ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవి ప్రకాశ్ మే 15 తేదీ ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు తోసిపుచ్చింది.

అయితే రవి ప్రకాష్ బెయిల్  పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో విజయ్ సాయి రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడే విజయ్ సాయి రెడ్డి.. తాజాగా రవి ప్రకాష్ పై ట్వీట్లతో విమర్శలు దాడి చేశారు. "నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది! విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్‌ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!" అని విమర్శించారు.

మరో ట్వీట్ లో.. "పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి." అంటూ పరోక్షంగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేస్తూ విమర్శించారు.