TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మందు చూపుతో టీడీపీలోకి... ముందు చూపుతో వైసీపీలోకి...

Published on: Wed Mar 11, 2015 6:12PM

 

మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున ఓ పెద్దాయన ఎంపీగా గెలిచారు పారిశ్రామికవేత్తగా మంచి పేరు ప్రతిష్ఠలున్న ఆ పెద్దాయన చిటుక్కున ఇలా గెలిచాడో లేదో లటుక్కున వైసీపీలోంచి టీడీపీలోకి జంపైపోయారు. ఆయనకు ఓట్లు వేసిన ఓటర్ల వేళ్ళమీద ఇంకు ఆరకముందే ఆయన జంప్ జిలానీ అయిపోయారు. ఆ జంప్ జిలానీ పేరేంటో తెలుసుకోవాలన్న ఇంట్రస్ట్ మీకు బాగా పెరిగిపోయింది కదూ.. ఆయన పేరును మేం చెప్పడం కంటే.. రెండు నిమిషాలు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. సరే, ఎన్నికలు అయిపోయాయి, పార్టీ మారడమూ అయిపోయింది... ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఆయన ప్రస్తావన ఎందుకనే సందేహం మీకు రావడం సహజం.. ఆ సందేహాన్ని తీర్చడం మా బాధ్యత. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకురావలసి వచ్చిందంటే... ఆయన మరోసారి పార్టీ మారబోతున్నారు. టీడీపీ నుంచి బ్యాక్‌ టు హోం అన్నట్టుగా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే మూటాముల్లె సర్దేసుకుని సిద్ధంగా వున్నారు. రేపో ఎల్లుండో వైసీపీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తాను తిరిగి వైసీపీలోకి వెళ్ళబోతున్నానని ప్రకటించే అవకాశం వుంది. మరి ఎంతో ముచ్చటపడి టీడీపీలో చేరిన ఆయన మళ్ళీ ఎందుకు వైసీపీలోకి వెళ్ళబోతున్నారు? దీని వెనుక వున్న అసలు కారణమేంటి? పార్టీ ఫిరాయింపుల చట్టం చేతిలో చిక్కి చిక్కి శల్యమైపోతానన్న భయమా? లేక మరేదైనా వుందా?

 

నిజానికి సదరు పెద్దాయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అవడం వెనుక ‘మందు’చూపు వుంది. అచ్చు తప్పు కాదు.. నిజంగానే మందుచూపు వుంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద డిస్టిలరీ వుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా డిస్టిలరీలు తెలంగాణ రాష్ట్రంలోనే వుండిపోయాయి. అయితే ఏపీలో సదరు పెద్దాయనకు ఉన్న డిస్టిలరీని ప్రభుత్వం ఒడిలోకి చేర్చితే తనకు బోలెడంత ఆదాయం వస్తుందని ప్లాన్ వేసిన ఆయన టీడీపీలో చేరిపోయారు. దాంతో ఈమధ్యే ఆయన డిస్టిలరీని ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ఆ పెద్దాయనికి బోలెడు ఆదాయం వచ్చేలా చేసింది. తన మందు చూపు వర్కవుట్ అయిందని హ్యాపీగా వున్న ఆ పెద్దాయనకి ఇంతలో ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. తనకు ఒక ప్రాణాంతక వ్యాధి వుందని, అది అడ్వాన్స్ స్టేజ్‌లో వుందని తెలిసిపోయింది. జీవితంలో ఎంతో శ్రమించి, ఎంతో సాధించిన తనకు ఇక శాశ్వత విశ్రాంతి తప్పదని ఆయనకు అర్థమైపోయింది. కాలం ముందు ఎవరైనా ఓడిపోక తప్పదన్న సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారు. ఈ దశలో ఆయన ఇప్పుడు ముందుచూపుతో, మధ్యంతర ఎన్నికల చూపుతో ఆలోచిస్తున్నారు. మందుచూపుతో టీడీపీలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ముందుచూపుతో వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. తన తర్వాత తన వారసుడు టీడీపీ తరఫున పోటీకి నిలిచిన పక్షంలో తనమీద ఆగ్రహంతో వున్న వైసీపీ తప్పకుండా పోటీ పెడుతుంది. అప్పుడు తన వారసుడు గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు. అదే తాను మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతే తన వారసుడు తప్పకుండా గెలిచే అవకాశం వుంది. టీడీపీ కూడా అభ్యర్థిని పోటీకి నిలిపే అవకాశం లేదు. ఎందుకంటే, నందిగామ, తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని నిలపలేదు. ఈ కోణంలో ఆలోచించిన ఆ పెద్దాయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. వైసీపీ నాయకుడు జగన్‌కి ఈ పెద్దాయన మీద కోపం వున్నప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.