మా సంసారంలో నిప్పులు పోయకండి

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు, సూచనల కోసం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశానని, రాజకీయాలు ఏవీ చర్చించలేదని అన్నారు. బీజేపీలో చేరే అవకాశాలు లేవని, ఒక ఎంపీగా మాత్రమే కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడగొట్టాలని కొంతమంది చూస్తున్నారని ఆరోపించారు. 

తనకు, పార్టీకి మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. తనకు, పార్టీకి మధ్య అగాధం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తానెప్పుడు పార్టీని పల్లెత్తుమాట అనలేదని, మీడియానే మా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తోందని, అలాంటి పనులు మానుకోవాలని సూచించారు. 

పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షునికి గానీ తాను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు. పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని.. అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానన్నారు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడానన్నారు. పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, పార్టీకి ప్రజలు దూరం కాకూడదని, పార్టీ మరో 20-25 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి ఆ సూచనలు చేశానని రఘురామకృష్ణంరాజు అన్నారు.