రఘురామకృష్ణం రాజు సీటు మారింది.. మరో మెట్టు ఎక్కినట్టే
Published on: Sat Jul 18, 2020 2:30PM
పార్టీకి విధేయుడినేనని చెబుతూ, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీరు కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఏకంగా పార్టీ పేరుకే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చుకున్న వైసీపీ.. తాజాగా ఆయనకు ఓ చిన్న ఝలక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన కూర్చునే సీటును మార్చింది. గతంలో నాల్గో లైన్‌లో ఉన్న ఆయన సీటును ఏడో లైన్‌లోకి మారుస్తూ లోక్‌సభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వైసీపీ లోక్‌సభా పక్షనేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. 379 సీట్లో ఉన్న రఘురామకృష్ణం రాజు 445 సీటుకు మారారు. మార్గాని భరత్ 385 నుంచి 379 కి వచ్చారు. వీరితో పాటు కోటగిరి శ్రీధర్ కు 421 నుంచి 385, బెల్లన చంద్రశేఖర్ కు 445 నుంచి 421 కేటాయించారు.
లోక్‌సభలో సీటు మార్పుపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. లోక్‌సభలో తన స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండబోదని అన్నారు. తనను మరో మెట్టు ఎక్కించారనుకుంటానని పేర్కొన్నారు. తమ పార్టీలో తనను వెలివేశారని, అయినప్పటికీ తాను ఎప్పుడూ సీఎం జగన్ కు, పార్టీకి విధేయుడినేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.


