'రేయ్.. రారా' అంటూ సీఐని పిలిచిన వైసీపీ ఎంపీ!!

 

మనం ఏ స్థాయికి ఎదిగినా మన స్నేహితులకు ఇచ్చే స్థానం మాత్రం మారదని మరోసారి రుజువైంది. అనంతపురం పట్టణ రూరల్ పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. బందోబస్తుగా అనంతపురం రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సమావేశంలో సభ నిర్వాహకులు అతిథులను ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. అంతలోనే.. ‘రేయ్ రారా మురళీధర్ రెడ్డి’ అంటూ ఎంపీ గోరంట్ల.. సీఐ ను పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. సీఐ మురళీధర్ వేదికపైకి రాగానే ఎంపీ గట్టిగా హత్తుకొని ‘నా ప్రాణ స్నేహితుడు నాకే బందోబస్తు నిర్వహించడం ఏమిటి? నా పక్కన కూర్చో’ అన్నారు. ఇద్దరూ వేదికపై కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఎంపీ గోరంట్ల మాధవ్, సీఐ మురళీధర్ రెడ్డిది 20 ఏళ్ల స్నేహం. ఇద్దరూ ఒకే డిపార్ట్‌మెంట్‌లో సీఐలుగా సేవలందిస్తూ వచ్చారు. అయితే గోరంట్ల గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసీపీ తరుపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. తాను ఎంపీగా గెలిచిన నాలుగునెలల తరువాత.. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన స్నేహితుడు సీఐ మురళీధర్ అదే కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించడం గమనించి ఆప్యాయంగా పలకరించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎంపీ అయినా స్నేహం విలువ మర్చిపోలేదని ఎంపీ గోరంట్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.