వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
Published on: Thu Sep 5, 2024 5:40PM
వైసీపీ నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అరాచకాలు, పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే కేసులో మరో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించిన క్షణం నుంచీ పరారీలో ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు బెంగళూరులో అదుపులోనికి తీసుకున్నారు. అక్కడ నుంచి మంగళగిరికి తరలిస్తున్నారు.
ఈ కేసులో ఇంకా దేవినేని అవినాష్, రఘురామ్ తదితరులు పరారీలోనే ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగు రమేష్ కూడా పరారీలో ఉన్నారు. ఆయన కోసం కూడా పోలీసులు విస్తృ తంగా గాలిస్తున్నారు. ఈ రెండు కేసుల్లోనూ పరారీలో ఉన్న వారి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపులో నిమగ్నమై ఉన్నాయి.
నందిగం సురేష్ కు రిమాండ్
కాగా తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు బుధవారం (సెప్టెంబర్ 4) హైదరాబాద్ లో అరెస్టు చేసి విచారణ నిమిత్తం మంగళగిరికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. నందిగం సురేష్ కు గురువారం కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.


