జగన్ పదవి ఇస్తానంటే.. మాకొద్దు బాబోయ్ అంటున్న వైసీపీ నేతలు
Published on: Sat Jun 1, 2019 4:12PM

రాజకీయ నాయకులకు పదవి ఇస్తామంటే ఎగిరి గంతేస్తారు. అంతెందుకు అసలు ఆ పదవుల కోసమే పార్టీ అధినేత దృష్టిలో పడాలని తెగ ప్రయత్నం చేస్తారు. అయితే ఏపీలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం.. సీఎం వైఎస్ జగన్ పిలిచి మరీ ఓ పదవి ఇస్తానంటే మాకొద్దు బాబోయ్ అంటున్నారట. ఇంతకీ ఆ పదవి ఏంటబ్బా అనుకుంటున్నారా?.. అసెంబ్లీ స్పీకర్. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పదవికి అంతలా భయపడటానికి ఓ సెంటిమెంట్ ఉందిలేండి. మన తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ గా పనిచేస్తే తదుపరి ఎన్నికల్లో ఓడిపోవడం ఆనవాయితీగా వస్తుంది. అది ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రుజువైంది.
1999 నుంచి 2004 వరకు స్పీకర్గా సేవలు అందించిన ప్రతిభాభారతి 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 నుంచి 2009 వరకు స్పీకర్గా ఉన్న కె.సురేష్ రెడ్డి 2009లో ఓటమి పాలయ్యారు. 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ చిట్టచివరి స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. విభజన అనంతరం కూడా ఈ సెంటిమెంట్ కొనసాగింది. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు ఏపీ స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఇలా సెంటిమెంట్ బలంగా ఉండడంతో నేతలు భయపడుతున్నారు.
అసెంబ్లీ స్పీకర్ పదవికి గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి గెలుపొందిన ఒకరిద్దరు పేర్లు వినపడుతున్నాయి. బాపట్ల నుంచి రెండోసారి ఎమ్మెల్యే గా గెలుపొందిన కోన రఘుపతి పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఇక మహిళకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే వైఎస్ఆర్ కుటుంబానికి విదేయురాలు, మూడు సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన మేకతోటి సుచరిత ను స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశం వున్నట్లు వినికిడి. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల పై విజయం సాధించిన వైసీపీ నేత అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరెవరూ స్పీకర్ పదవి నీ చేపట్టేందుకు సుముఖంగా లేరని సమాచారం. జగన్ తమని ఎక్కడ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తారోనని భయపడిపోతున్నారట. మరి ఈ సెంటిమెంట్ పట్టించుకోకుండా స్పీకర్ పదవి చేపట్టడానికి ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి.


