యువకుడిని కారుతో గుద్ది ఏం పట్టనట్టు వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
Published on: Thu Jun 13, 2019 5:34PM

ఇటీవలి కాలంలో.. అనేక మంది ప్రజాప్రతినిధులు.. తాము వెళ్తున్న రోడ్డుపై ప్రమాదాలు జరిగినట్లు కనిపిస్తే.. వెంటనే తమ కాన్వాయ్‌లో వాహనమో లేక సొంత వాహనమో ఇచ్చి ఆస్పత్రికి పంపించిన ఘటనలు చాలా విన్నాం. వాళ్లను మానవతా వాదులుగా చెప్పుకున్నాం. అయితే చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మాత్రం తన కారు ఢీ కొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడితే.. ఆమె అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గుంటూరు నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలో.. నిడమర్ర రోడ్డు, బాపూజీ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నవీన్ అనే యువకుడ్ని విడదల రజనీ కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే కారు దిగిన రజనీ ఆ యువకుడిని పట్టించుకోకుండా.. అటుగా వస్తున్న ఆటోలో వెళ్లిపోయారు. గన్‌మెన్లు కూడా అదే దారి చూసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు నిర్లక్ష్యంగా అలా వెళ్లిపోవడంతో.. ఆ గాయపడిన వ్యక్తి బాధతో విలవిల్లాడిపోయాడు. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ చేసిన ఎమ్మెల్యే కనీసం మానవత్వం కూడా చూపకుండా అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.


