అనంతలో ఆగని వైపీపీ నేతల అరాచకాలు!  కంకర క్రషర్‌పై ఎమ్మెల్యే  తనయుడి దాడి! 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది.  ప్రజా ప్రతినిధులే స్వయంగా దాడులకు పాల్పడుతుండటంతో ఇతర నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల వరుసగా జరిగిన దాడి ఘటనలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపగా.. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.  రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని ఓ కంకర క్రషర్‌పై దాడి చేశారు. 20 ద్విచక్ర వాహనాల్లో వచ్చిన దాదాపు 30 మంది దుండగులు బీభత్సం సృష్టించారు. కంప్యూటర్‌ గది, జేసీబీలను ధ్వంసం చేశారు. క్రషర్‌లో పనిచేస్తున్న కార్మికులపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 

వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కార్మికులు ఫిరోజ్‌, సద్దాం, ఇజ్రాయెల్‌, తిమ్మేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయదుర్గం అర్బన్‌ సీఐ వీరన్న ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు క్రషర్‌ యజమాని లక్ష్మీదేవి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.