బోరున విలపించిన ఫైర్ బ్రాండ్ రోజా!!

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా తనని పిలవడం లేదని, ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రోజా కన్నీటి వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలే ఆమె ఆవేదనకు కారణమని చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా.. రోజాకు సమాచారం అందించలేదు. దీంతో ఆమె నొచ్చుకుని.. ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో జరిగిన కమిటీ మీటింగ్ లో తన సమస్యలను రోజా వివరించే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తనకి ఆహ్వానం అందలేదని తెలిపారు. గతంలో ఇలా పలుసార్లు జరిగిందని కమిటీ ముందు తన ఆవేదన వెలిబుచ్చారు. ఉద్దేశ పూర్వకంగానే తనను పిలవడం లేదని పిర్యాదు చేశారు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు. రోజా ఫిర్యాదు పై స్పందించిన గోవర్ధన్ రెడ్డి అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ నిచ్చారు.