వైసీపీ ఎమ్మెల్యే సంచలనం.. నన్ను జగన్ కూడా ఏం చేయలేడని వ్యాఖ్యలు!! 

 

వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జమీన్ రైతు వారపత్రికలో తమకు వ్యతిరేక కథనాలు రాస్తున్నారంటూ కోటంరెడ్డి తన అనుచరులతో కలిసి.. ఆ పత్రిక ఎడిటర్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్టు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ఒక జర్నిలిస్టును కోటంరెడ్డి ఫోన్ లో బెదిరించిన వ్యవహారం రాజకీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పించింది. అయితే దీనిపైన కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. నెల్లూరులో కొందరు జర్నలిస్టుల పేరుతో దందాలు చేస్తున్నారని.. అటువంటి వ్యక్తిని తాను హెచ్చరిస్తే తాను అనని మాటలను సైతం జోడించి తనను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ వివాదం ముగిసిపోక ముందే తిరిగి ఇప్పుడు పత్రిక ఎడిటర్ మీద స్వయంగా ఎమ్మెల్యేనే దాడి చేసారని ఆరోపణలు రావడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతోంది.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై దాడి చేసారని జమీన్ రైతు వార పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో ఉన్న తన ఇంటికి ఎమ్మెల్యే మద్యం సేవించి వచ్చారని అన్నారు. ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్‌ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని ఆరోపించారు. వస్తూనే.. ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో.. అంటూ బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ చేయలేరు. ఎవరితో చెప్పుకుంటావ్‌ ఎస్పీతోనా, మంత్రితోనా, సీఎం జగన్ తోనా ఎవ్వరితోనైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అని బెదిరించారన్నారు. ఇంటివద్దకు వచ్చి ఇలా రచ్చ చేయడం ఏమిటని తాను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కొట్టారని ప్రసాద్ ఆరోపించారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరికొందరు కూడా తనపై దాడి చేశారని మీడియా సమావేశంలో డోలేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. జర్నలిస్టులను బెదిరింపులు, దాడులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటంరెడ్డిపై సీఎం జగన్ ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.