మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. హాట్ హాట్ గా విశాఖ జడ్పీ మీటింగ్
Published on: Sun Dec 19, 2021 2:24PM
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. అసమ్మతి స్వరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత.. మంత్రి బాలినేని ముందే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతల తీరు బాగా లేదని చెప్పారు. ఇలాగైతే పార్టీ మరోసారి గెలవడం అసాధ్యమని చెప్పారు. కర్నూల్ జిల్లాలో ఏకంగా జడ్పీ చైర్మెనే రాజీనామా చేశాడు. తన భావమరిదికి పదవి కోసం ఎమ్మెల్యే ఒత్తిడి చేయడం వల్లే జడ్పీ చైర్మెన్ సుబ్బారెడ్డి రాజీనామా చేశారనే ప్రచారం జరగుతోంది. ఈ ఘటనలు వైసీపీలో కలవరం రేపుతుండగానే.. తాజాగా విశాఖ జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఫైరయ్యారు. సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ జెల్లి సుభద్ర అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.అయితే వైస్ చైర్మన్లను వేదికపైకి ఆహ్వానించడంపై ఎమ్మెల్యే కన్నబాబు రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టం లేకపోతే వెళ్లి పోతామని మంత్రి వంతిపై ఫైర్ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీలకు ప్రత్యేక చా౦బర్లు కేటాయించాలని ఎమ్మెల్యే కన్నబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటన సమావేశంలో కాక రేపింది. ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్సే కన్నబాబురాజును ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూల్ చేసే ప్రయత్నం చేశారు.


