TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడియో బయటపడినా అదే బుకాయింపు ! ఎవరిని బెదిరించలేదంటున్న  కన్న బాబురాజు  

Published on: Thu Feb 4, 2021 2:27PM

ఏపీలో జరుగుతున్న  పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  నామినేషన్లు వేయవద్దంటూ  ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్న ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ  అధికార పార్టీ నేతల బాగోతాలు బట్టబయలవుతున్నాయి. అయినా తాము ఎవరిని బెదిరించడం లేదని బుకాయిస్తున్నారు అధికార పార్టీ నేతలు. 

తాను బెదిరించిన ఆడియో వైరల్ గా మారినా... తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు. విశాఖ జిల్లా  ఎలమంచిలి   ఎమ్మెల్యే కన్నబాబు రాజు. తనపై పెట్టిన కేసులో వాస్తవం లేదన్నారు.  తానూ ఎవర్ని బెదింరించలేదని  వెల్లడించారు, ఒక వేళ తాను ఎవర్నైనా బెదిరించినట్టు ఆధారాలు చూపిస్తే   ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు కన్నబాబు రాజు. ఏకగ్రీవమైతే గ్రామానికి రూ. 15 లక్షలు వస్తుందని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పానని వివరించారు.  అంతే గాని తాను ఎవరినైనా బెదిరించలేదని, బెదిరించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తానని తెలిపారు.
 
 రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. అయితే  ఎమ్మెల్యే కన్నబాబురాజు  అభ్యర్థి రుత్తల సత్యం అల్లుడు సంతోష్ కి  ఫోన్‌ చేసి బూతులు తిట్టారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ బయటికి రావడంతో సంచలనంగా మారింది.  ఆ ఆడియో ఆధారంగా చూపుతూ   రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో  ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు సత్యం. దీంతో ‌ఎమ్మెల్యే కన్నబాబు రాజు, అతని అనుచరుడు డీఎస్‌ఎం రాజుల పై ఐపీసీ 506,171ఎఫ్‌తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.  తనపై నమోదైన కేసుపై  స్పందించిన ఎమ్మెల్యే కన్న బాబురాజు ..  తాను ఎవరిని బెదిరించలేదని కవరింగ్ ఇచ్చుకున్నారు.  ఆడియోలో బెదిరింపుల పర్వం బయటపడినా.. ఎమ్మెల్యే బుకాయించడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.