మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి
Published on: Thu Jun 2, 2022 12:07PM
వైసీపీ నేతలు వివాదాలను ఆహ్వానిస్తారో.. లేక వివాదాలే వారిని వెతుక్కుంటూ వస్తాయో అర్ధం కాదు కానీ, ఏపీలో అధికార పార్టీ నేతలు తరచూ వివాదాలతో సహవాసం చేస్తుంటారనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. తాజాగా రాజానగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా వివాదంలో ఇరుక్కున్నారు. వివాదాలు ఆయనకు కొత్తకాదు. రాజమహేంద్రవరం ఎంపి భరత్ తో విభేదాలతో చాలా కాలం ఆయన వివాదాలతో సహవాసం చేశారు. వారిరువురి మధ్యా విభేదాలు ఇప్పుడు సద్దుమణిగాయి అది వేరే సంగతి. విపక్షంలో ఉన్న సమయంలో కూడా జక్కంపూడి రాజా ప్రభుత్వోద్యోగిపై చేయి చేసుకున్నారు. అలాగే కొద్ది కాలం కిందట సీతానగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపకుడిపై దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఇక తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఏఈఈ) సూర్యకిరణ్ పై చేయి చేసుకుని మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. తనపై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి చేయి చేసుకున్నట్లు సూర్యకిరణ్ రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబధించి రంగంపేట పరిధిలోని పుష్కర కాలువ పూడిక తీత పనుల బిల్లులకు సంబంధించి జక్కంపూడి రాజా జలవనరుల శాఖ సమీక్షా సమావేశంలో ప్రశ్నించారు.
సూర్యకిరణ్ వివరణ ఇస్తుండగానే జక్కంపూడి ఆయనపై దాడి చేసి చేయి చేసుకున్నారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా వారెవరూ అడ్డుకోలేదు. నోరు మెదప లేదు.
కాగా సూర్యకిరణ్ రాజమహేంద్ర వరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెబుతుంటే.. త్రీ టౌన్ సీఐ మాత్రం జక్కంపూడిపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని అంటున్నారు.
ఇలా ఉండగా సూర్యకిరణ్ పై దాడికి నిరసనగా శుక్రవారం భోజన విరామ సమయంలో ధవళేశ్వరం జల వనరుల కార్యాలయం వద్ద ఆ శాఖ ఏఈలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి తరచూ వివాదాలలో నిలుస్తుండటం పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అధికారం ఉందన్న అహంకారంతో.. పోలీసుల అండతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని తెలుగుదేశం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నది. ఏఈఈపై చర్య తీసుకున్న జక్కంపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. ఫిర్యాదు చేసినా అందలేదంటూ సీఐ చెప్పడాన్ని తప్పుపట్టింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయిందనడానికి సూర్యకిరణ్ పై దాడి ఒక నిదర్శనం అని పేర్కొంది.


