సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే నోటిదురుసు..
Published on: Mon Jan 10, 2022 1:40PM
టాలీవుడ్‌ను ఎంతలా ఆగం చేయాలో అంతకంటే ఎక్కువే ఆగమాగం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గించేసి పరిశ్రమపై పిడుగు పడేశారు. థియేటర్ క్యాంటీన్‌లో టీ ధర కంటే తక్కువగా.. సులభ్ కాంప్లెక్స్ టికెట్ కంటే చీప్‌గా.. 5 రూపాయలకే సినిమా అందిస్తూ.. ఇండస్ట్రీని దివాళా అంచుకు తోసేస్తున్నారు. సినిమా వాళ్లు ఎంత మొత్తుకుంటున్నా.. ఎంతగా వేడుకుంటున్నా.. కనికరించడం లేదు జగమొండి జగన్. మధ్యలో ఆర్జీవీ ఎంట్రీ అవడం.. పేర్ని నాని వర్సెస్ వర్మ ఎపిసోడ్ హాట్ హాట్‌గా నడుస్తున్న తరుణంలో.. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్ధించుకున్నారు.
ఓవైపు సినిమా టికెట్స్ ధరల వ్యవహారంలో జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే.. మరోవైపు పేర్ని నాని, కొడాలి నాని, నల్లపురెడ్డిలాంటి వైసీపీ నేతలు టాలీవుడ్‌ను మరింత గిల్లుతున్నారు. సినిమా వాళ్లు మెతకనో.. అన్నిటికీ నోరుమూసుకు పడుంటారనే ధీమానో.. కారణమేదైనా బలిసి కొట్టుకుంటున్నారంటూ బూతులు మాట్లాడే స్థాయికి దిగజారారు వైసీపీ నేతలు అని మండిపడుతున్నారు.


