గడప గడపకూ ఫ్లాప్..ఇక మంత్రుల బస్సుయాత్ర
Published on: Fri May 20, 2022 7:51AM
ఎలాగైనా సరే ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల ‘సత్ఫలితా’లను వారికి వివరించాలని జగన్ డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం వైసీపీ అధినేత గడప గడపకూ అంటూ ప్రజాప్రతినిథులను జనంలోకి వెళ్లమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా వారు ఖాతరు చేయకపోవడం.. వెళ్లిన కొద్ది మందీ కూడా ప్రజాగ్రహ జ్వాలలకు జడిసి కార్యక్రమాన్ని ‘మమ’ అనిపిస్తూ చాప చుట్టేయడంతో ఆ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
దీంతో ఇలా లాభం లేదనుకున్నారో ఏమో.. ఇప్పుడు సామాజిక న్యాయ యాత్ర అంటూ మంత్రుల బస్సు యాత్రకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు బస్సులలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులను జనంలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు బస్సులలో నాలుగు రోజుల పాటు ఈ ‘ సామాజిక న్యాయ యాత్ర’ సాగనుంది. పదవులలో బలహీన వర్గాలకే పెద్ద పీట వేశామని చాటుకోవడంతో పాటు సంక్షేమ పథకాల ప్రచారం కూడా ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. గడప గడపకు తిరిగిన ప్రజాప్రతినిథులు ప్రజల ప్రశ్నల శర పరంపరను తట్టు కోలేక ఉక్కిరి బిక్కిరై.. వెనుదిరుగుతుంటే.. ఏం చేయాలో దిక్కుతోచని జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకూ వెళ్లాల్సిందే అని ఆదేశించారు. ఆ ఆదేశాలను మెజారిటీ ప్రజా ప్రతినిథులు బేఖాతరు చేయడమే కాకుండా జనంలోకి వెళ్లడానికి ససేమిరా అంటుండటంతో.. ప్రజల వద్దకు నేరుగా వెళ్లడం కంటే మంత్రులను బస్సుల్లో పంపితే వారు జనానికి దూరంగా, బస్సులపై నుంచే మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన పథకాల గురించి వివరించే అవకాశం లభిస్తుందన్నది జగన్ యోచన చేశారని పార్టీ వర్గాల కథనం.
సామాజిక న్యాయ యాత్ర పేర జగన్ తలపెట్టిన ఈ మంత్రుల బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు నాలుగు బస్సులలో పాల్గొంటారు. ఈ బస్సు యాత్ర రూట్ మ్యా్‌పపై ప్రభు త్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మా న ప్రసాదరావులు సమీక్ష జరిపి ఖరారు చేశారు. శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపట్టి.. బహిరంగ సభలు నిర్వహిస్తారు.
26న శ్రీకాకుళం 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బస్సుయాత్ర, బహిరంగ సభలు జరుగుతాయి. ఈ నెల 10 జగన్ ప్రతిష్టాత్మకంగా భావించి ఈ నెల10 నుంచి ప్రారంభించిన గడపగడపకూ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులపై జనం నిరసనలతో తిరగబడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బస్సు యాత్రను తెరపైకి తెచ్చారు.
దానిని కూడా సెలక్టివ్ గా కేవలం నాలుగు నియోజకవర్గాలకే పరిమితం చేయడం ప్రభుత్వం ప్రజాగ్రహానికి ఎంతగా బెదరిపోతున్నదో చెప్పడానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. మొత్తం మీద నాలుగు నియోజకవర్గాలతోనే బస్సు యాత్రను ముగించాలన్ననిర్ణయమే.. మిగిలిన నియోజకవర్గాలలో జనాల ఆగ్రహాన్ని ఫేస్ చేయడం మంత్రులకైనా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయని ప్రబుత్వం భావించడమేనన్న విశ్లేషణలకు పరిశీలకులు పదును పెట్టారు. నాలుగు నియోజకవర్గాలకే పరిమితమైన ఈ బస్సు యాత్రలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం, అందుతున్న పథకాలను మంత్రులు ప్రజలకు వివరిస్తారు. బస్సులపై నుంచి ప్రసంగాలతో ప్రజాగ్రహజ్వాలలకు దూరంగా ఉండొచ్చన్నది జగన్ ప్లాన్ అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.


