ఆ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతారట!!

 

క‌ర్నూలు జిల్లాలోని మంత్రాల‌యం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మీద ఏర్పడిన సానుభూతి పుణ్యమా అని అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతారా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2009లో ఏర్ప‌డ్డ మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టిసారి బాల‌నాగిరెడ్డి టీడీపీ త‌ర‌పున విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున బరిలోకి దిగగా, టీడీపీ తరపున పాల‌కుర్తి తిక్కారెడ్డి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో బాల‌నాగిరెడ్డి.. తిక్కారెడ్డిపై 7 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లోనూ వీరిద్ద‌రి మ‌ధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జ‌రిగింది. అయితే ఎన్నిక‌లకు ముందు తిక్కారెడ్డి.. బాల‌నాగిరెడ్డి సొంత ఊరికి ప్ర‌చారానికి వెళ్ల‌గా.. బాల‌నాగిరెడ్డి వ‌ర్గీయులు, గ్రామ‌స్థులు తిక్కారెడ్డిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో గ్రామంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జరిగింది. ఈ సమయంలో గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరపగా.. అనుకోకుండా తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయ‌మైంది. ఈ దాడిని ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రంగా మ‌లుచుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స్ట్రెచ్చ‌ర్ పైన గ్రామగ్రామాన తిరిగి ప్ర‌చారం చేశారు. ఆయ‌న భార్య వెంక‌టేశ్వ‌ర‌మ్మ కూడా భ‌ర్త‌ను స్ట్రెచ్చ‌ర్ పై తీసుకెళ్లి కొంగు చాచి ఓట్లు అభ్యర్థించారు. ప‌లుమార్లు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో వారి ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి బాగా వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతి తిక్కారెడ్డిపై ఇప్ప‌టికే ఉంది. దీనికి తోడు బులెట్ గాయంతో స్ట్రెచ్చ‌ర్ పై ప్రచారం చేయడంతో ఆ సానుభూతి రెట్టింపైంది. మొత్తానికి సానుభూతి పుణ్యమా అని వైసీపీ సిట్టింగ్ స్థానం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.