ఇదేనా రాజన్న రాజ్యం.. వైసీపీ నేతల బెదిరింపులతో సంస్థ ప్రతినిధులు పరారు!!

 

రివర్స్ టెండరింగ్ లు, ఒప్పందాల రద్దులు, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు వంటి నిర్ణయాలతో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీకి కంపెనీలు రాకుండా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుండి కంపెనీల వరకు.. జగన్ తీసుకున్న నిర్ణయాలను మళ్ళీ ఆలోచించి వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. దీంతో ఏపీ వైపు కంపెనీలు చూడవని టీడీపీ సహా పలువురు విమర్శిస్తున్నారు. ఒకవైపు జగన్ నిర్ణయాలతోనే కంపెనీలు వస్తాయా రావా అన్న సందేహాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు కొందరు స్థానిక వైసీపీ నేతల పుణ్యమా అని ఉన్న కంపెనీలు కూడా పోయేలా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మూడు రోజుల కిందట.. అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన వారికే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వాలని 'సీమెన్స్ గమేషా' సంస్థ ప్రతినిధులకు హుకుం జారీ చేశారట. తమ నేతతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారట. వాహనాల సరఫరా కాంట్రాక్టుతో పాటు సెక్యూరిటీ గార్డు కాంట్రాక్టును తమకే కేటాయించాలని ఒత్తిడికి గురిచేశారట. గత ప్రభుత్వంలో తీసుకున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్లను వెంటనే తొలగించాలంటూ ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు యాజమాన్యానికి సమాచారం ఇచ్చి అనంతపురం నుంచి పరారైపోయారని తెలుస్తోంది.

గత ఐదేళ్ళలో అనంతపురం జిల్లాకు ప్రతిష్టాత్మకమైన సంస్థలు వచ్చాయి. కియా తో పాటు అనుబంధ సంస్థలు, అలాగే పవన విద్యుత్ సంస్థలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థల యజమానులను కొందరు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారట. పరిశ్రమల్లో కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగాలు తమ వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. పవన విద్యుత్ సబ్ స్టేషన్లు మూసి వేయాలంటూ కార్యాలయం ముందు గొడవలకు దిగుతున్నారట. ఈ రకంగా వైసీపీ నేతలు పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెదిరింపులకు గురవుతున్న పారిశ్రామికవేత్తలు పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదట. వైసీపీ నేతలతో సెటిల్ చేసుకోమని పోలీసులు సలహాలిస్తున్నారట. మొత్తానికి కొందరు స్థానిక వైసీపీ నేతల పుణ్యమా అని అనంతపురం జిల్లాలోని సంస్థల ప్రతినిధులు బెదిరిపోతున్నారట. దీంతో సోషల్ మీడియాలో.. 'వైసీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం' అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.