కౌంటింగ్ రోజు ఏపీలో కుట్రలు.. ఆ కలెక్టర్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష చేయాలి

 

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఈనెల 23న జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు అదనపు భద్రత, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేయాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈరోజు ఢిల్లీలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు ఎన్నికల సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. కౌంటింగ్‌ రోజున అలజడులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశం ఉందని, అందువల్ల అదనపు బలగాలను నియమించాలని కోరారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు. కౌంటింగ్‌ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు విజ్ఞప్తిచేశారు.

అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చేసిన అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్లమన్నారు. తన పేషీలో పనిచేసిన ప్రద్యుమ్నను చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా నియమించాక.. ఆయనతో టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు లై డిటెక్టర్‌ పరీక్ష చేస్తే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మనుషులు 7 పోలింగ్‌ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడడ్డారని. పోలింగ్ ఆఫీసర్‌ను కూడా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బెదిరించారని విజయసాయిరెడ్డి చెప్పారు. దళితులు ఓటేయకుండా అడ్డుకున్న ప్రద్యుమ్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరామన్నారు.

'రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన గూండాలు, రౌడీలను పోలింగ్ ఏజెంట్లు.. కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించారు. తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయించి.. రాష్ట్రంలో అరాచకాలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను అడ్డుకోవాలని కోరాం' అని తెలిపారు.