టీఆర్ఎస్ కోసం రంగంలోకి వైసీపీ..! హుజూర్ నగర్ లో కుల రాజకీయం

 

హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్... అదే బాటలో సీపీఎంను కూడా దాదాపు తన వైపు తిప్పుకుంది. మరోవైపు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు అందర్నీ రంగంలోకి దింపి, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారం చేయిస్తోంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం... ఏపీ లీడర్లను కూడా రంగంలోకి దించాలని డిసైడైందట. హుజూర్ నగర్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, అది కూడా కమ్మ, కాపు కులస్తులు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో వైసీపీ కమ్మ, కాపు నేతలతో కులాల వారీగా ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ చూస్తోందట. 

హుజూర్ న‌గ‌ర్ లో క‌మ్మ‌, కాపు ఓట‌ర్లు  ప్రభావం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ లో 11వేల మంది కమ్మ ఓట‌ర్లు ఉండ‌గా, కాపు ఓట‌ర్లు ఏడు వేల మందికి పైగా ఉన్నారు. అయితే, కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా... క‌మ్మ సామాజికవ‌ర్గం ఓట‌ర్లలో మాత్రం పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించిందట. దాంతో కమ్మ నేతలను రంగంలోకి దింపి... ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, రెడ్డి ఓట్లు అత్యధికంగా 27వేల వరకు ఉన్నాయి. అయితే, మెజారిటీ రెడ్డి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపొచ్చన్న అంచనాలతో, క‌మ్మ‌, కాపు ఓట‌ర్లపైనే గులాబీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ కమ్మ, కాపు వైసీపీ నేతలను ప్రచారానికి పంపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. దాంతో దసరా తర్వాత, ఏపీ వైసీపీ నేతలు.... హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు.

ఒకవేళ, ఏపీ వైసీపీ నేతలు... టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారంచేస్తే అది కాంగ్రెస్ కు అడ్వాండేజ్ గా మారుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు... తెలంగాణలో ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నట్టే... ఇప్పుడు టీకాంగ్రెస్ కూడా ఏపీ నేతల క్యాంపెయిన్ ను అస్త్రంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మరి, నిజంగానే ఏపీ వైసీపీ నేతలు... హుజూర్ నగర్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలి.