TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశంలో ప్రవేశానికి రూటిదేనా?!

Published on: Thu Sep 12, 2024 4:15PM

వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీని వీడేందుకు పెద్ద సంఖ్యలో నేతలు రెడీగా ఉన్నప్పటికీ వారికి మరో పార్టీలో ప్రవేశం లేకపోవడంతో అనివార్యంగా వైసీపీలోనే కొనసాగు తున్నా రనడం లో   ఎటువంటి సందేహం లేదని స్పష్టమైపోతోంది. అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహ రించిన వైసీపీ నేతలంతా ఇప్పుడు షెల్టర్ కోసం వెతుక్కుంటున్నారు. అలా తెలుగుదేశం, జనసేన, బీజేపీలలో షెల్టర్ దొరికిన నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. చెప్పకుండా సైలెంట్ గా మిగిలిన నేతలు ఎప్పుడు ఆయా పార్టీల తలుపులు తెరుచుకుంటాయా దూరిపోదామని ఎదురు చూస్తున్నారు.

అలా తెలుగుదేశం గూటికి చేరడానికి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకరు. ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పని చేశారు. ఆయనకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలలో పరాజయం పాలు కాగానే ఆయన పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. ఐదేళ్ల పాటు అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు.  మళ్లీ వైసీపీ అధికారం కోల్పోగానే హోం కమింగ్ అంటూ తెలుగుదేశం తలుపు తడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఎంత గట్టిగా తలుపుకొడుతున్నా తెలుగుదేశం మాత్రం పట్టించుకోవడం లేదు.  ఆయన ఎంత ప్రయత్నించినా చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కూడా దక్కలేదు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులు, క్యాడర్ ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని గట్టిగా చెబుతున్నాయి. అయినా శిద్దారాఘవరావు మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. 

సరిగ్గా ఈ తరుణంలో బెజవాడను ముంచెత్తిన వరదలు ఆయనకు చంద్రబాబును కలవడానికి అవకా శంగా మారాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం పేరుతో ఆయనకు అతి సులువుగా చంద్రబాబు అప్పాయింట్ మెంట్ దక్కింది. తన వ్యాపార సంస్థల తరఫున సీఎంఆర్ఎఫ్ కు 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన శిద్దారాఘవరావు ఆ చెక్కును స్వయంగా చంద్రబాబుకు అందజేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు శిద్దారాఘవరావు ఉదారతను అభినందించారు. అంతే శిద్దాకు తెలుగుదేశం ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న వార్తలు జోరందుకున్నాయి.  

దీంతో చంద్రబాబును కలవాడానికి ఇదే సరైన దారి అని భావించి వరదబాధితుల సహాయం అంటూ చెక్కులు పట్టుకుని క్యూకట్టేయడానికి  పలువురు వైసీపీయులు రెడీ అయిపోయారు. సైకిలెక్కే యడానికి ఇదే మంచి దారి, సమయం అని భావిస్తున్నారు. అలాంటి వారందరికీ తెలుగుదేశం పార్టీ తలుపులు బార్లా తెరిచేస్తుందా అంటే పార్టీ వర్గాలు ప్రశక్తే లేదని కుండబద్దలు కొడుతున్నాయి. వరద బాధితులకు సహాయం చేయడం మంచిదే. అలా సహాయం చేయడాన్ని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఆ పేరుతో రాజకీయ లబ్ధి పొందే అవకాశం మాత్రం ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్లు వైసీపీ హయాంలో చేసిన తప్పులను వరద బాధితులకు సాయంతో కడిగేసుకోవచ్చు అనుకుంటే మాత్రం జరిగే పని కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.