చంద్రగిరిలో డబ్బులు పంచుతూ బుక్కైన వైసీపీ నేతలు

 

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. పోలింగ్ జరిగిన ఇరవై ఐదు రోజుల తర్వాత.. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిపై టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. పోలింగ్ జరిగిన మరుసటి రోజే పలు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కానీ.. దాదాపు నెలరోజుల తరువాత వైసీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే ఆదేశాలు ఇవ్వడం ఏంటి? ఇదంతా కుట్ర అని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

అయితే ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ అని ఈసీ అలా ప్రకటించిందో లేదో.. అప్పుడే ఆయా కేంద్రాల పరిధిలోని ఓటర్లకు నేతలు డబ్బులు పంచడం మొదలుపెట్టారు. చంద్రగిరికి చెందిన వైసీపీ స్థానిక నేతలు కొందరు ఓటుకి మూడు వేలు చొప్పున పంచుతూ పట్టుబడ్డారు. స్థానికులు, టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డబ్బులు పంచుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ డబ్బు పంపిణీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దళితులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. కాగా ఆయనతో పాటు నిన్న ప్రెస్ మీట్ లో పాల్గొన్న వ్యక్తులే ఈరోజు డబ్బులు పంచుతూ పట్టుబట్టారు. డబ్బులు తీసుకున్న ఓటర్లే స్వయంగా తమకి ఓటుకి ౩వేలు చొప్పున ఇచ్చారని అంగీకరించారు. పోలీసులు డబ్బుల పంచిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.