TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీని న‌మ్ముకొని నాశ‌నం.. 30 ల‌క్ష‌ల అప్పులతో ఆగ‌మాగం..

Published on: Fri Jan 14, 2022 7:49PM

వైసీపీలో బాగుప‌డింది ఎవ‌రు? జ‌గ‌న్‌రెడ్డి, విజ‌యసాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. ఆ రెడ్డి, ఈ రెడ్డి అంతేగా. ఇక వైసీపీని న‌మ్ముకొన్న వారంతా నానాగోస ప‌డుతున్నారు. ఒక్క‌ఛాన్స్ అని అంద‌ల‌మెక్కిస్తే.. అథఃపాతాళానికి తొక్కేస్తున్నారు. కూలి వాడి నుంచి బ‌డా వ్యాపారి వ‌ర‌కూ ఏ ఒక్క‌రూ బాగుప‌డ‌టం లేదు. రాష్ట్రం దివాళా తీసింది. వ్యాపారులు, ప్ర‌జ‌లు అంతా నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. ఆయ‌న మాత్రం తాడేప‌ల్లి ప్యాలెస్‌లో సేద తీరుతున్నారు. 

ఇక‌, వైసీపీ నేత‌ల ప‌రిస్థితి మ‌రింత దారుణం. బిగ్ ఫిష్‌లు బాగుప‌డుతున్నాయి గానీ.. చిన్నాచిత‌కా నాయ‌కులు న‌ట్టేట మునుగుతున్నారు. ప‌నులు, ప్రాజెక్టులు ఉంటేగా.. పార్టీ లీడ‌ర్లుగా ఉన్నందుకు రాబ‌డి. క‌నీసం రోడ్డు కాంట్రాక్టు ప‌నుల‌న్నా చేసుకుందామంటే రోడ్లేసే నాథుడే లేడాయే. అభివృద్ధి ప‌నుల‌న్నీ అట‌కెక్క‌డంతో ద‌మ్మిడి ఆదాయం లేకుండా పోయింది వైసీపీ నాయ‌కుల‌కు. అలాంటి ఓ చోటా లీడ‌ర్ తాజాగా త‌న ఆర్థిక క‌ష్టాల‌ను చెప్పుకుంటూ సెల్ఫీ వీడియో చేశాడు. అదిప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. 

వైసీపీ మీద ఉన్న అభిమానంతో రూ.30లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికంగా ఎంతో నష్టపోయానని గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్నా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడినప్పటికీ ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోవటం లేదన్నారు. తన మాదిరిగా మరో కార్యకర్త నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే వీడియో పోస్టు చేసినట్టు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.