మోడీ పాట పాడిన మరో వైసిపి నేత.. అసలేం జరుగుతోంది

వైసిపిలో ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు రాజేసిన కుంపటి ఇంకా చల్లారలేదు. అయన స్వపక్షంలో విపక్షం లాగా తయారయ్యారని ఆ పార్టీ నేతలు ఒక పక్క మండి పడుతున్నారు. ఇపుడు దీనికి మరో వైసిపి నేత జత అయ్యారు. తాజాగా సినీ నిర్మాత, విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థి పీవీపీ మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. చైనా పై బలంగా డిజిటల్ స్ట్రైక్ చేసి, దౌత్యం ద్వారా సరిహద్దు నుంచి వెనక్కినెట్టారని ట్విటర్‌లో మెచ్చుకున్నారు.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. పీవీపీ తన ఇంటిపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. అదే సమయంలో తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారని మరోసారి ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి నుండి అయన అజ్ఞాతంలోకి వెళ్లి.. మళ్ళీ ఈ రోజు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు.

"శాంతి సందేశం పంపిస్తున్న చైనా..! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా, డిజిటల్ స్ట్రైక్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు." పీవీపీ ట్వీట్ చేశారు.

పెండింగ్ కేసుల విషయంలో పీవీపీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితుల్లో ఆయన ప్రధాని మోదీని కీర్తిస్తూ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ కేసుల నుండి బయట పడేందుకు పీవీపీ మోడీని కీర్తిస్తున్నారా లేక ఈయన కూడా రఘురామ కృష్ణంరాజు తరహాలోనే బీజేపీకి చేరువవుతున్నారా అని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.