వైసీపీ నేత పీవీపీ అరెస్ట్

వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లో ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌ పేరిట పీవీపీ నిర్మాణాలు చేశారు. ఇందులో ఒక విల్లాను విక్రమ్‌ కైలాస్‌ కొనుగోలు చేశారు. ఆ విల్లాను మరింత ఆధునికీకరించేందుకు.. టెర్రస్‌పై రూఫ్‌ టాప్ గార్డెన్‌ ను ఏర్పాటు చేయడానికి విక్రమ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో అనుచరులతో కలిసి వచ్చిన పీవీపీ.. విల్లను ఎలా అమ్మానో అలానే ఉంచాలని ఆధునీకరించడానికి వీల్లేదని అన్నారు. అంతేకాక విక్రమ్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సామాగ్రిని ధ్వంసం చేశారు. రూఫ్ గార్డెన్ కోసం తీసుకొచ్చిన వస్తువులు, ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు.

దీంతో, బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీ 20 మంది అనుచరులతో తన ఇంటి మీద దాడి చేశారని, తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని, పీవీపీ వల్ల తనకు ప్రాణ హాని ఉందని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు‌తో పీవీపీపై ఐపీసీ 447,427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు పిలిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత పీవీపీని అరెస్ట్ చేశారు.