చెప్పుతో కొట్టుకుని వైసీపీ నేత.. ఆయన్ను గెలిపించి తప్పు చేశా..
Published on: Wed Mar 2, 2022 4:10PM
జగనన్న తీరుతో సామాన్య ప్రజానీకంతో పాటు సొంతపార్టీ నేతలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్ రెడ్డి పాలన పట్ల సీనియర్ నాయకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వైసీపీలో కొత్త జిల్లాల చిచ్చు అంతా ఇంతా కాదు. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా.. వైసీపీ నేతలు జగన్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఆనం జిల్లాల విభజన తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టగా.. లేటెస్ట్ గా మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఏకంగా చెప్పుతో కొట్టుకొని తనను తాను శిక్షించుకున్నారు. జగనన్నను, స్థానిక ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశానని.. కొత్తపల్లి.. తన కొత్త చెప్పుతో కొట్టుకోవడం కలకలం రేపింది.
పశ్చిమగోదావరిలో.. నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఇప్పుడు బాధపడుతున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు మోసం చేశారని కొత్తపల్లి విమర్శించారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయకుండా ప్రసాదరాజు ప్రజలను మోసం చేశారన్నారు. బ్రిటీష్ కాలం నుంచి గొప్ప చరిత్ర ఉన్న నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో జగన్‌ని దృష్టిలో పెట్టుకొని పని చేశామని.. అప్పుడే తెలిసి ఉంటే ప్రసాదరాజు లాంటి వ్యక్తికి ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దని ప్రజలు కోరుకునే వారని అన్నారు.
నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు.. కొత్త జిల్లాల సెగ మరింత రాజేశారు. సొంతపార్టీ నేతలే ఇలా విమర్శలకు దిగడంతో.. జగనన్న రేపిన జిల్లాల చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు.


