TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పాలనలో లంచం ఇస్తేనే సంక్షేమ పథకం! బండారం బయటపెట్టిన వైసీపీ నేత

Published on: Fri Dec 31, 2021 9:31AM

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ సంక్షేమ జపం చేస్తున్నారు. అర్హులందరికి వివిధ పథకాల కింద సాయం అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కాని సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, లంచాలు ఇచ్చిన వాళ్లకే వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక వైసీపీ నేతలు, అధికారులు కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. తాజాగా వైసీపీ నాయకుడే.. జగన్ సర్కార్ అవినీతి బండారం బయటపెట్టారు. 

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కావాలంటే పేదలు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని స్థానిక వైసీపీ నేతే ఏకంగా మీడియా ముందు బయటపెట్టేశారు. మండల వైసీపీ అధ్యక్షుడే అక్కడి అధికారుల అవినీతి భాగోతాన్ని బయటపెట్టారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తుందంటూ కృష్ణాజిల్లా, మోపిదేవి మండల వైసీపీ అధ్యక్షుడు మోహన శివరాజయ్య మీడియా ముందు వాపోయారు. తమ గ్రామానికి చెందిన రాజులపాటి నాగమల్లేశ్వరరావుకు అన్ని అర్హతలు ఉన్నా ఇంటి పట్టా ఇవ్వకుండా.. ఇప్పటికే ఇల్లున్న అతని సోదరుడికి పట్టా ఇచ్చారని ఆయన తెలిపారు. ఇదేంటని అడిగితే రూ. 20వేలు ఇస్తేనే పట్టా ఇస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. 

తహసీల్దార్ కార్యాలయం అవినీతి మయంగా మారిపోయిందని, తమ గ్రామానికి చెందిన పలువురు నుంచి తహసీల్దార్ లంచం తీసుకున్నారని శివరాజయ్య ఆరోపించారు. వైసీపీ పాలనపై వైసీపీ నేతే అవినీతి ఆరోపణలు చేసిన వ్యవహారం జిల్లాలో  హాట్ టాపిక్‌గా మారింది. అవనిగడ్డే కాదు రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.