వైసీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించే అవకాశం

 

జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభోదానంద ఎపిసోడ్‌లో.. అప్పుడు కదిరి సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం మెలేస్తూ జేసీకి వార్నింగ్ ఇచ్చి ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్దిరోజులకు ఆయన సీఐ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయనకు వైసీపీ హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే గోరంట్ల మాధవ్ నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఐ ఉద్యోగానికి మాధవ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ ఇంకా ఆమోదం పొందలేదు. గోరంట్ల మాధవ్ తన రాజీనామా లేఖను జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీకి పంపారు. అయితే.. డిపార్ట్‌మెంట్ నుంచి ఆయన ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం లభించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. నామినేషన్ల గడువు ముగిసేలోపు గోరంట్ల మాధవ్ రాజీనామా ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను వైసీపీ అన్వేషిస్తోంది. మాధవ్ భార్యను లేదా మరెవరినైనా రంగంలోకి దించాలని వైసీపీ భావిస్తోందట.