వైసీపీ పడుకుందా...మూర్ఖత్వమే అవుతుంది...

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో ఏపీ రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే బడ్జెట్ ను ప్రవేశపెట్టిందో.. ఆమరుసటి రోజు నుండే ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేయడంతో.. మోడీ ప్రభుత్వం పై ప్రజలు రగిలిపోతున్నారు. ఇక మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా బీజేపీతో తెగదెంపులు తెంచుకోవడానికే చూస్తుంది. అంతేకాదు ఏపీకి జరిగిన నష్టాన్ని పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ.. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగురోజులుగా టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు చివరి పార్లమెంట్ సమావేశాలు చివరిరోజు.. మరి ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు.

 

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. అసలు ఇంత వ్యవహారం నడుస్తుంటే వైసీపీ నేతలు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు అన్నది అందరి సందేహం. ఒకపక్క  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ ఊర్లు తిరుగుతున్నాడు. ఒకప్పుడు జగన్ యాత్ర అంటే ఏ ఛానల్ లో చూసిన జగనే కనిపించేవాడు. మరి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ ఛానల్ లో తప్ప వేరే ఛానల్ లో జగన్ ఊసే లేదు. ఇక ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై ఒకపక్క టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలు చేస్తూ ఏపీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఏదో మొదటి రోజు టీడీపీ ఎంపీలతో కలిసి కొంచం సేపు కలరింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. అంతేకాదు మోడీ ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా వైసీపీ ఎంపీలు సభలో లేకుండా పోయారు. మరి నిన్న కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీలో బంద్ జరిగినా వైసీపీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అఖరికి పూర్తి స్థాయి పార్టీ నిర్మాణం లేని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా జంద్ లో పాల్గొన్నారు కానీ వైసీపీ ఊసే లేదు.

 

మరి ఇన్నిరోజులు చంద్రబాబు ఏం చేస్తున్నారు... విభజన హామీల గురించి చంద్రబాబు కేంద్రాన్ని అడగలేక పోతున్నారు అంటూ సందు దొరికితే విమర్శలు గుప్పించే వైసీపీ నేతలు ఇప్పుడు ఏమయ్యారు. ఇంత జరుగుతున్న బయటకు ఎందుకు రావడంలేదు. పార్టీలకతీతంగా అందరూ ఏకతాటి పైకి వచ్చి ఏపీకి న్యాయం చేయాలని ఒకపక్క డిమాండ్ చేస్తుంటే.. ఈ సమయంలో బయటకు వచ్చి తమ వంతు వాదనను వినిపించాల్సి వైసీపీ నోరెత్తడంలేదు. దీనికి కారణం మోడీకి భయపడటమేనా. టీడీపీ బీజేపీతో విడిపోతే.. వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తుంది. అందుకే ఎక్కడ రివర్స్ అయితే ఆఛాన్స్ పోతుందా అని భయటపడుతున్నారా అన్నది రాజకీయ వర్గాల టాక్. మరి నిజంగా అదే నిజమైతే వైసీపీదే మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. టీడీపీతో బీజేపీ పొత్తు కాబట్టే ఆ నాలుగు సీట్లయినా వచ్చాయి. ఇక టీడీపీతో విడిపోతే బీజేపీకి చుక్కలే. ఇక ఇప్పుడు కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి చేసిన అన్యాయం చూసి తెలుగు ప్రజలు రగిలిపోతున్నారు. అలాంటిది వైసీపీ ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటే.. వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పనక్కర్లేదు. ఇప్పుడైనా వైసీపీ కళ్లు తెరిచి అందరితో పాటు ఈ పోరాటంలో చేయి కలిపితే... అప్పుడైన కాస్త ప్రజలు నాలుగు ఓట్లు వేస్తారు. లేకపోతే వచ్చే నాలుగు ఓట్లు రాకుండా పోతాయి. మరి చూద్దాం వైసీపీ ప్లాన్ ఏంటన్నది.