నిమ్మగడ్డ రీఎంట్రీ.. అధికార పార్టీకి పెద్ద తలనొప్పి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో.. ప్రస్తుతం నిమ్మగడ్డ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ రీఎంట్రీ తో జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవా? నిమ్మగడ్డను జగన్ సర్కార్ ఎలా ఫేస్ చేస్తుంది? వంటివి హాట్ టాపిక్ గా మారాయి.

కరోనా కారణంగా గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అగ్గి రాజుకుంది. నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రభుత్వం మండిపడింది. అసలు కరోనా ప్రభావం లేదు ఏంలేదు, చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, ప్రతిపక్ష టీడీపీ కోసమే ఎన్నికల వాయిదా వేశారంటూ.. అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు.

నిజానికి ఎన్నికల వాయిదాకి ముందు నిమ్మగడ్డ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అధికార పార్టీ నేతలు పలు చోట్ల బెదిరింపులకు, దాడులకు పాల్పడి.. ఇతర పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా చేసి.. ఏకగ్రీవం చేసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. నామినేషన్ల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఒకానొక టైములో ఎన్నికల సంఘం తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే, ఇంతలో కరోనా ఉదృతి పెరుగుతుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ ఒక్కసారిగా నిమ్మగడ్డపై విరుచుకుపడింది. అంతేకాదు, కరోనా ప్రభావం లేదని చెప్పి.. ఎలాగైనా ఎన్నికలు నిర్వహిచాలని పంతానికి పోయారు. అందుకే ఆర్డినెన్స్ తెచ్చి నిమ్మగడ్డని తప్పించారు.. ఆ స్థానంలో కనగరాజ్ ని కూర్చోబెట్టారు. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్నట్టుగా.. అధికార పార్టీ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఓ వైపు కరోనా ఉదృతి, మరోవైపు కోర్టు కేసుతో..  కనగరాజ్ కూడా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు కోర్టు తీర్పుతో మళ్లీ నిమ్మగడ్డనే రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.

హైకోర్టు తీర్పుపై స్పందించిన నిమ్మగడ్డ.. తాను గతంలో పని చేసినట్లుగానే నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదించి, సాధారణ స్థితికి వచ్చిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో సాధారణ స్థితి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. గత కొద్దిరోజులుగా ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో అసలు ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అని అభ్యర్థుల్లో భయం మొదలైంది.

నామినేషన్ వేసిన ఉత్సాహంలో ఉన్న చాలామంది అభ్యర్థులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా బాగా ఖర్చుపెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు, పండ్లు వంటివి పంచుతూ పరోక్షంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఎంట్రీతో ఇప్పటిదాకా మేం చేసిన ఖర్చంతా వృధానేనా అని అభ్యర్థులు వాపోతున్నారు.

ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి చాలా రోజులైంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియపై ఆరోపణలున్నాయి. నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానంటూ రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ.. ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అధికార పార్టీ ఏకగ్రీవాలు ఆగిపోతాయి, అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడి ఇతరులను నామినేషన్లు వేయనివ్వలేదన్న సంకేతాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. మరోవైపు, అభ్యర్థులకు కూడా తిప్పలు తప్పవు. ఇప్పటికే కరోనా మూలంగా ఎన్నికలు ఆలస్యంగా జరిగేలా ఉన్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభిస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. పాపం, ఎన్నికలు త్వరలోనే ఉంటాయనుకొని చాలామంది అభ్యర్థులు సాయం పేరుతో చాలా ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నారు. కొందరైతే అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఖర్చుపెట్టారు. కానీ ఏం లాభం?. ఎన్నికలు ఆలస్యమైతే ఈ ఖర్చంతా జనాలు మర్చిపోతారు. మళ్లీ ఎన్నికలప్పుడు ఫ్రెష్ గా ఖర్చుపెట్టాలి. మొత్తానికి నిమ్మగడ్డ ఎంట్రీతో బాగా ఖర్చు పెట్టిన అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది.