రైతు కోటయ్య మృతి.. కొండవీడులో హై అలర్ట్‌

 

గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయ రంగు పులుముకుంది. రైతుని పోలీసులే కొట్టి చంపారంటూ ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని.. ఆత్మహత్య చేసుకున్న రైతుని కాపాడటానికి పోలీసులు ఎంతగానే శ్రమించారని చెప్తూ దానికి సంభందించిన ఫోటోలు, వీడియోలు కూడా చూపించారు. దీంతో రైతు మృతికి పోలీసులు, చంద్రబాబే కారణమని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. రైతు కోటయ్య మృతి విషయంలో నిజనిర్థారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కొండవీడులో పర్యటించనుంది. మరో వైపు జనసేన కూడా కొండవీడులో పర్యటించనుంది. అదేవిధంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా నేడు రైతు కోటయ్య పొలంలో స్థానిక రైతులతో భేటి కానున్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలు ఒకేసారి కొండవీడుకు రానుండటంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అదేవిధంగా హై అలర్ట్‌ ప్రకటించారు.