వైసీపీ బిగ్ మిస్టేక్.. మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమా?

 

తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా తగులుతుంది. ముఖ్యంగా వైసీపీకి.. ఈ తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేసిన తప్పిదం వల్ల ఏపీలో నష్టం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల పోరు ప్రధానంగా టీఆర్ఎస్, మహాకూటమి మధ్య జరగనుంది. వైసీపీ, జనసేన తప్ప దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. జనసేన తమ మద్దతు ఏ పార్టీకో చెప్పలేదు కానీ.. వైసీపీ మాత్రం మహాకూటమిలో టీడీపీ ఉండటంతో ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపించి. కూకట్ పల్లి, ఎల్బీనగర్ లాంటి నియోజక వర్గాల్లో కొందరు వైసీపీ నేతలు మా మద్దతు టీఆర్ఎస్ కే అంటూ కండువాలు కప్పుకొని మరీ కనిపించారు. అయితే ఇదే ఏపీలో వైసీపీ కొంప ముంచుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ ప్రజలు ప్రత్యేహోదా మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం మొండిచేయి చూపింది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ వెనకడుగు వేసిందంటూ టీడీపీ, బీజేపీకి దూరమై పోరాడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్.. కేంద్రలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద తొలి సంతకం చేస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, కాంగ్రెస్ కి దగ్గరైంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమితో కలిసి టీఆర్ఎస్ మీద పోరుకి సిద్ధమైంది. దీంతో కేసీఆర్ ఆంధ్ర పెత్తనం అంటూ చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ప్రత్యేకహోదా కి మేం వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకుంటున్నారు. అలాంటిది ప్రత్యేకహోదాని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ కి వైసీపీ మద్దతు ఎలా ఇస్తుంది? అంటే వైసీపీ కూడా ప్రత్యేకహోదాకి వ్యతిరేకమా? అని ప్రశ్నలు మొదలయ్యాయి.

సైలెంట్ గా ఉండకుండా అనవసరంగా టీఆర్ఎస్ కి మద్దతుగా సంకేతాలు ఇచ్చామని వైసీపీ నేతలు కొందరు కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో వైసీపీ లేదనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. తరువాత వారు పార్టీని వీడారు. కేడర్ కూడా ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బరిలోకి దిగితే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అందుకే జగన్ కూడా ఏపీ మీదనే తన దృష్టంతా పెట్టి తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ టీఆర్ఎస్ కి మద్దతుగా వైసీపీ ఇస్తున్న సంకేతాలే ఏపీలో ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అసలే తెలంగాణలో పార్టీ ఉనికిపోయింది. ఏపీలో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు ప్రత్యేకహోదాకి వ్యతిరేకమనే సంకేతాలు ఏపీ ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే ప్రమాదముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.