వైసీపీ రోత రాజకీయం.. ఉమా మహేశ్వరి మరణాన్నీ వదలని వైనం
Published on: Wed Aug 3, 2022 10:28AM
మహాకవి శ్రీశ్రీ కాదేదీ కవితకనర్హం అన్నారు. కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రం కాదేదీ రాజకీయానికి అనర్హం అంటున్నది. సమయం, సందర్బం లేకుండా రొచ్చు రాజకీయాలతో రచ్చ చేయాలని ప్రయత్నిస్తోంది.
ఒక కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో కూడా రోత రాజకీయ క్రీడకు తెరలేపి పరువు పోగొట్టుకుంది. సామాన్య జనం సైతం ఛీత్కరించేలా వ్యవహరించింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణం విషయంలోనూ వైసీపీ రాజకీయం చేయడానికే మొగ్గు చూపింది. ఒక పక్క ఉమామహేశ్వరి మరణంతో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండగా.. వైసీపీ మాత్రం ఉమామహేశ్వరి మరణాన్నిరాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించి అభాసుపాలైంది. పరువును గంగలో కలిపేసుకుంది.
ఉమామహేశ్వరికి కానీ, ఆమె భర్తకు కానీ, ఆమె పిల్లలకు కానీ రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో ఉమామహేశ్వరి బలవనర్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద సమయంలో వైసీపీ రాజకీయ క్రీడకు తెగబడింది. సంబంధం లేని ఆరోపణలతో ఆ కుటుంబం మరింత బాధపడేలా చేయడానికి ప్రయత్నించింది. వైసీపీ నాయకుడు, ఏపీ అటవీ కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, ఉమామహేశ్వరి అక్క కుమారుడు లోకేష్ తో వాగ్వాదం కారణంగానే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారంటూ ట్వీట్ చేశారు.
ఆ వాగ్వాదానికి కారణం ఓ భూమి విషయంలో తగాదానే కారణమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి గుర్రం పాటి తన ట్వీట్ లో పొందు పరిచిన సర్వే నంబర్లతో భూమే లేదని తేలిపోయింది. పలువురు నెటిజన్లు అంతర్జాలంలో వెతికి మరీ ఆ ఆధారాలు బయటపెట్టారు. దీంతో గుర్రంపాటి విమర్శ, ఆరోపణ బూమరాంగ్ అయ్యింది. గుర్రం పాటి విమర్శలపై, ఆరోపణలపై వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. పలువురు అయితే నేరుగా గుర్రంపాటికే నేరుగా ఇదా రాజకీయానికి సమయం అంటూ ట్వీట్ చేసి చీవాట్లు పెట్టారు.


