ఎంపీ మరణించే రెండు రోజులే.. అప్పుడే తిరుపతి ఉపఎన్నికపై కన్ను

బహుశా దేశం మొత్తంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలే సెపెరేట్. ఏ చిన్న అవకాశాన్నైనా ఉపయోగించుకోవడంలో ఈ రాష్ట్ర రాజకీయ పార్టీల రూటే సెపరేటు.  అది అధికారంలో వున్న పార్టీనా, ప్రతిపక్షంలో వున్న పార్టీ నా అని పెద్ద తేడాలేమి ఉండవ్. 

 

దీనికి ఒక గొప్ప ఉదాహరణే తిరుపతి లోక్ సభ స్థానం. ఈ స్థానం నుండి సిట్టింగ్ లోక్ సభ సభ్యులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 64 సంవత్సరాల బల్లి దుర్గా ప్రసాద్ కేవలం రెండు రోజుల క్రితం, అంటే బుధవారం చెన్నై లో హృద్రోగ వ్యాధితో మరణించారు. కనీసం రెండు రోజులు కూడా గడవక ముందే, ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది, జరిగితే అది తిరిగి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఖాతా లోకి వెళ్తుందా, లేక ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ చేజిక్కించుకుంటుందా అనే విశ్లేషణ అప్పుడే మొదలయింది. 

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఈ స్థానానికి కూడా ఉపఎన్నిక జరుగుతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అంటే ఆక్టోబర్ చివరిలో గాని, నవంబర్ మాసం మొదట్లో గాని ఈ ఉప ఎన్నిక జరగవచ్చని, అందువల్ల దీనికి ఇప్పటి నుండే తయారు కావాలని పార్టీ కార్యకర్తలకు అధినాయకత్వం ఆదేశాలు ఇప్పటికే జారీచేసినట్లు సమాచారం. ఈ స్థానంలో గెలిస్తే, ప్రస్తుతం రాజధాని తరలింపుపై అమరావతి లో 275 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని, దీనిని రాజధాని తరలింపుపై ప్రజామోదంగా జనంలోకి తీసుకు వెళ్ళ వచ్చని అధికార పార్టీ వ్యూహంగా చెబుతున్నారు. 

 

ఇక, ప్రతిపక్ష తెలుగు దేశం కూడా తక్కువేమి తినలేదు. తిరుపతి లోక్ సభ స్థానం, పార్టీ జాతీయ ఆధ్యక్షుడైన చంద్రబాబు సొంత జిల్లాలో ఉండడంతో, ఆ పార్టీ దీనిని కొంతమేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ స్థానంలో గెలిస్తే అమరావతి తరలింపుపై ప్రజలు అధికార పార్టీ నిర్ణయాన్ని అంగీకరించలేదని ప్రజలలోకి తీసుకెళ్లవచ్చని, దీనిని రెఫరెండం గా భావించాలని డిమాండ్ చెయ్యాలని కూడా తెలుగు దేశం నాయకత్వం భావిస్తోయిందని సమాచారం. అసలు తాము ఇప్పుడే ఎన్నికలకు రెడీ కాకపోయినా, వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకత్వం దూకుడుతో, తాము వెకబడ్డామనే భావన ప్రజలలో రాకుండా ఉండాలంటే తాము కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్ళ్లాలని నిర్ణయించామని చెబుతున్నారు టీడీపీ నాయకులు. 

 

ఏది ఏమైనప్పటికి, అసలు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు చనిపోయి కేవలం రెండు రోజులు కూడా కాకుండా, ఇలా తిరిగి ఎప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయనే ఆలోచన రావడమే ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.