వైసీపీ + బీజేపీ పొత్తు?.. హోదాతో ఎత్తు! మరి, జనసేన..!?
Published on: Sun Feb 13, 2022 1:18PM
ఏదో జరుగుతోంది. తెరవెనుక ఎవరో పావులు కదుపుతున్నారు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య రాజకీయ మార్పులు రాబోతున్నాయి. పొలిటికల్ ఈక్వేషన్ మార్చేసే ప్రయత్నం జరుగుతోంది. లేకపోతే ఏంటి? ఉన్నట్టుండి రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం కమిటీని వేయడం ఏంటి? చర్చల ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం చేర్చడమేంటి? ఆ వెంటనే వైసీపీ వర్గాలు జగనన్న వల్లే ఏపీకి స్పెషల్ స్టేటస్ అంటూ ఊదరగొట్టడం ఏంటి? అంతలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎంట్రీతో ఎజెండా నుంచి హోదాను డిలీట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన పరిణామం మాత్రం అస్సలు కాదంటున్నారు. అంతా పక్కా ప్లాన్డ్ స్క్రీన్‌ప్లే అని చెబుతున్నారు. బీజేపీ, వైసీపీ పొత్తుకు ముందస్తు మసాలా దట్టిస్తున్నారని తెలుస్తోంది.
కేంద్రహోంశాఖ అధికారులు మరీ అజ్ఞానులు ఏమీ కారు. వారికి రాష్ట్ర విభజనపై బాగానే అవగాహన ఉంది. నీతిఅయోగ్‌ను సాకుగా చూపి, కేంద్రప్రభుత్వం ఏపీ స్పెషల్ స్టేటస్‌కు ఎసరు పెట్టిందనే విషయం అందరికంటే వారికే బాగా తెలుసు. అలాంటిది ఏదో పొరబాటున అంత కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారులు అలా ప్రత్యేక హోదా అంశాన్ని కమిటీ ఎజెండాలో చేర్చే అవకాశమే లేదు. అంటే, కావాలనే ఆ మిస్టేక్ చేశారని అంటున్నారు. బీజేపీకి, వైసీపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ కలిగించడానికే ఈ స్టేటస్ స్కెచ్ వేశారని అనుమానిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ లెక్కల్లో ఇప్పుడు ఏపీ కీలకంగా మారిందని అంటున్నారు.
యూపీలో బీజేపీ సీట్లకు బాగా డ్యామేజ్ జరగనుందని పక్కాగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగానూ మోదీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. అందుకే, తమకు కానీ, తమ మిత్రులకు కానీ అనుకూలంగా ఉన్న రాష్ట్రాలపై కన్నేసింది కమలదళం. వారికి రెండు తెలుగురాష్ట్రాల్లో మంచి అవకాశాలు కనిపించాయి. అందుకే, ఏడేళ్లుగా కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న రాష్ట్ర విభజన తేనెతెట్టును రాజ్యసభలో తన ప్రసంగంతో కదిలించారు ప్రధాని మోదీ. మానిన గాయాన్ని మళ్లీ కెలికి.. తెలంగాణలో కేసీఆర్‌కు లాభం చేసి, అవసరమైనప్పుడు కారును కంట్రోల్‌లోకి తీసుకోవాలనేది బీజేపీ వ్యూహం అంటున్నారు.
ఇక, ఏపీ విషయంలోనూ బీజేపీ ఇలాంటి డ్రామానే ఆడబోతోందని తెలుస్తోంది. పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశంలోకే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఎలాగూ ఈసారి దెబ్బపడబోతోంది కాబట్టి ఆ మేరకు మేజిక్ ఫిగర్‌ను ఏపీ నుంచి కవర్ చేయాలనేది మోదీ ఆడుతున్న నెంబర్ గేమ్ అంటున్నారు. అంటే.. ఏపీలో బీజేపీ నేరుగా బరిలో దిగి.. 25 స్థానాల్లో గెలుద్దామనేమీ అనుకోకపోవచ్చు. తాము గెలవకపోయినా.. తమ వాడితో క్లీన్‌స్వీప్ చేయిస్తే.. పరోక్షంగా అది బీజేపీకే అనుకూలం అనేది ఢిల్లీ భావన. అందుకే, ఆంధ్రుల సెంటిమెంట్‌ను, ఎమోషనల్స్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో సడెన్‌గా స్పెషల్ స్టేటస్‌ను చర్చలో పెట్టారని.. కావాలనే రచ్చ చేయాలని చూశారని విశ్లేషిస్తున్నారు.
ఏపీకీ ప్రత్యేక హోదా తెచ్చిన, ఇచ్చిన పార్టీలను ఆంధ్రులు ఆదరించే అవకాశం లేకపోలేదు. అయితే, హోదా ఇచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పువ్వు గుర్తుకు పోలోమంటూ ఓట్లేసి గెలిపించేటంత సీన్ లేదని ఢిల్లీకి బాగా తెలుసు. అలాగని జగన్‌నూ ప్రజలు విశ్వసించరనీ తెలుసు. అందుకే, తమ రహస్య స్నేహితుడు జగన్‌కు లబ్ది చేకూరేలా.. ఆయన్ను హోదా యోథుడ్ని చేసేలా ప్లాన్ రెడీ చేసినట్టున్నారు. జగనే ఎందుకు..? జనసేనాని ఉన్నారుగా..? అనే అనుమానం రాకమానదు. అయితే, ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా చూస్తే.. పీకే కంటే జగనే కట్టప్పలా.. ఢిల్లీ చెప్పుచేతల్లో ఉండే మనిషి అవుతారనే భావన కావొచ్చు. కేసులు, సీబీఐ, ఈడీలతో జగన్‌రెడ్డిని ఢిల్లీ డైరెక్షన్‌లో చెప్పినట్టు ఆటాడించడం సులువు. అదే, పవన్‌కల్యాణ్‌ను అలా తోలుబొమ్మలా మార్చడం కష్టమే. అందులోనూ, పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయిన జనసేనానిని నమ్ముకోవడంకంటే.. ఒక్క ఛాన్స్‌లానే.. మరోక్క ఛాన్స్ అంటూ జనాలను పప్పుబెల్లాలతో వెర్రిపప్పలను చేయగల టాలెంట్ ఉన్న జగనే సో బెటర్ అనేది బీజేపీ లెక్కలా కనిపిస్తోంది.
అయితే, పీపుల్స్ పల్స్‌ను బట్టికానీ, సర్వేల ప్రకారం కానీ.. యూపీలానే ఏపీలోనూ వైసీపీ-జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని బీజేపీ గుర్తించింది. సైకిల్ జోరు మీదుందని.. ఈసారి చంద్రబాబు-టీడీపీ గాలి వీయబోతోందని లెక్కేసింది. అలా జరగకుండా అడ్డుకునేలా.. ఫ్యాన్ స్పీడ్ పెంచి.. ఆ గాలిని తమవైపునకు తిప్పుకునేలా.. స్పెషల్ స్టేటస్ సునామీ సృష్టించాలనేదే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.
ముందుగా హోదా కోసం ఏపీని రెచ్చగొట్టి.. కాస్త ఉద్యమ వాతావరణం క్రియేట్ చేసి.. అందులో వైసీపీని ముందుంచి.. ఎన్నికల ముందు స్పెషల్ స్టేటస్ ప్రకటించాలనేది ఢిల్లీ ప్లాన్‌గా అనుమానిస్తున్నారు. అలా, హోదా ఇచ్చిన, తెచ్చిన క్రెడిట్ అంతా బీజేపీ + వైసీపీ ఖాతాలో వేసుకొని.. ఎలక్షన్స్‌కు వెళ్లాలనేది ఆ రెండు పార్టీల ద్వంద్వ వ్యూహంగా తెలుస్తోంది. కుదిరితే ఎన్నికలకు ముందే అధికారికంగా వైసీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం.. లేదంటే, ఎలక్షన్స్ తర్వాత ఇప్పటిలానే డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో వైసీపీ సపోర్ట్ తీసుకోవడం. ఎలాగోలా.. సొంతంగా కాకపోయినా టీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీల మద్దతుతో ఢిల్లీ సింహాసనాన్ని మళ్లీ కైవసం చేసుకోవడం. ఇదీ.. బీజేపీ-మోదీ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. అందుకే, రాష్ట్ర విభజనను, ప్రత్యేక హోదాను మళ్లీ రాజేశారని విశ్లేషిస్తున్నారు.


