TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీస్ స్టేషన్ పై వైసీపీ కార్యకర్తల దాడి

Published on: Wed May 8, 2019 3:07PM

 

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ పై రాళ్ళు, కొబ్బరి బొండాలతో దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ సత్యనారాయణమూర్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్11న జరిగిన ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ అభ్యర్థి ఎస్వీఎన్‌ఎన్‌ వర్మ పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు ఉప్పాడ కొత్తపల్లి జడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలపడం, అనంతరం వర్మ వాహనం అద్దాలు పగుల గొట్టడం, గన్‌మెన్‌ను గాయపరిచడం జరిగింది. దీంతో వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లి పోలీసులు.. వర్మ వాహనంపై దాడి చేసిన తిక్కాడ యోహానును, ఓసిపల్లి కృపను మంగళవారం అరెస్ట్‌చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 
దీంతో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అన్యాయంగా అరెస్ట్‌చేసిన తమ కార్యకర్తలను కోర్టుకు తరలించకుండా స్టేషన్‌బెయిల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో నిందితులను పోలీసులు కోర్టుకు తరలించే యత్నం  చేయడాన్ని వైసీసీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు కొబ్బరి బొండాలు, రాళ్ళతో పోలీస్ స్టేషన్, కానిస్టేబుళ్లపై దాడిచేశారు. దీంతో పోలీసులు ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో కాకినాడ త్రీటౌన్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణమూర్తికి తలకు తీవ్రగాయమైంది. ఇద్దరు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎమ్మెల్యే వర్మ వాహనంపై దాడిచేసిన ఇద్దర్ని పిఠాపురం కోర్టుకు తరలించారు.