వైకాపా నెల్లూరు కార్పొరేటర్లు చలో గోవా

 

వచ్చే నెల 3న మేయర్ ఎన్నికలు జరుగబోతున్నందున వైకాపా తన కార్పోరేటర్లను తెదేపావైపు గోడ దూకకుండా ఉండేందుకు నానా తిప్పలు పడుతోంది. ఆ పార్టీకి నెల్లూరు మేయర్ పదవి దక్కించుకోవడానికి 30మంది కార్పొరేటర్లు ఉన్నందున, నగర మేయర్ పదవి దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న వైకాపా తన కార్పొరేటర్లు తెదేపా వైపు మళ్ళకుండా ఉండేందుకు వారినందరినీ సకుటుంబసమేతంగా నిన్న గోవాకు తరలించింది. మళ్ళీ మేయర్ ఎన్నిక జరిగే రోజునే వారిని వెనక్కి రప్పించి నేరుగా ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలని వైకాపా భావిస్తోంది. ఈసారి వైకాపా మేయర్ అభ్యర్ధిగా అబ్దుల్ అజీజ్ నిలబెడుతోంది. తమ కార్పోరేటర్లను తెదేపా నేతలు ప్రలోభాల నుండి కాపాడుకోవడానికి స్థానిక వైకాపా యం.యల్యే.లు డా.అనిల్ కుమార్ రెడ్డి మరియు కోమటి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కార్పోరేటర్లతో కలిసి గోవా బయలుదేరారు. వారితో బాటు మరో ఇద్దరు వైకాపా నేతలు బీ. శ్రీధర్ రెడ్డి మరియు రూప కుమార్ యాదవ్ కూడా తమ కార్పోరేటర్లను కాపాడుకోవడానికి వారితో కలిసి గోవా వెళ్ళారు. కేవలం కార్పోరేటర్లను మాత్రమే పంపించినట్లయితే, తెదేపా నేతలు వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి కార్పోరేటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రమాదం ఉందనే భయంతో కార్పోరేటర్ల కుటుంబ సభ్యులందరినీ కూడా గోవా తరలించారు.

 

అధికారంలోకి వచ్చిన తెదేపా ఈవిధంగా ఇతర పార్టీల కార్పోరేటర్లను ప్రలోభాలకు గురిచేసి తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదని, ప్రజా తీర్పును ఆ పార్టీ గౌరవించడం నేర్చుకోవాలని వైకాపా నేతలు అంటున్నారు. ఇటువంటి ధోరణిని ఎవరూ హర్షించరు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తన విధేయులను ఎప్పుడు తలచుకొంటే అప్పుడు వైకాపాలోకి రప్పించి ప్రభుత్వాన్ని కూలగొట్టగలనని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనడమే కాకుండా ఆ తరువాత కాంగ్రెస్, తెదేపాలు చెందిన మొత్తం 19మంది యం.యల్యే.లను మూకుమ్మడిగా వైకాపాలోకి ఫిరాయింపజేసారు. ఆనాడు దానినొక ఘనకార్యంగా చెప్పుకొని భుజాలు చరుచుకొన్న వైకాపా నేడు తెదేపా తన కార్పోరేటర్లను ఆకర్షించేప్రయత్నాలు చేయడం చాలా అన్యాయమని గగ్గోలు పెట్టడం విచిత్రం. వైకాపా తాను మొదలు పెట్టిన ఈ వికృతరాజకీయ క్రీడకు ఇప్పుడు తానే బలయిపోతోంది. అందుకు ఎవరినీ నిందించడం అనవసరం కూడా.