కేసీఆర్ పని సులువు చేసిన యనమల

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో విద్యాభ్యాసం చేస్తున్న ఆంధ్రా విద్యార్ధులకు పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లించేందుకు విముఖత చూపిస్తుండటంతో, దానిపైనే ఆధారపడి చదువులు కొనసాగిస్తున్న అనేకమంది ఆంద్ర విద్యార్ధులు వారి తల్లితండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ కేసీఆర్ కానీ ఆయన మంత్రులెవరూ కానీ దీనిపై ఎటువంటి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అది గమనించి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లించకపోయినట్లయితే, ఆంధ్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, అందువలన విద్యార్ధులు, వారి తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఆయన ఆవిధంగా చొరవ తీసుకొని ప్రకటించడం చాలా హర్షణీయం. అయితే కాగల కార్యం గందర్వులే నెరవేర్చారన్నట్లు, ఆంధ్రా విద్యార్ధులకు తమ ప్రభుత్వమే పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని మంత్రి యనమల స్వయంగా ప్రకటించడంతో ఇక కేసీఆర్ కు ఎటువంటి నిందలు, అపవాదులు ఎదుర్కొనే బాధ తప్పింది. కనుక నేడో రేపో కేవలం తెలంగాణా విధ్యార్థులకు మాత్రమే తమ ప్రభుత్వం పీజ్ రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని ఆయన నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చును.