వలసపోతున్న యానాం రీజెన్సీ కార్మికులు
Published on: Tue Feb 28, 2012 2:54PM
యానాం
: యానాంలోని రీజెన్సీ సిరామిక్ కార్మికులు పొట్టకూటికోసం వలసలు పోతున్నారు. రీజెన్సీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య వివాద నేపధ్యంలో జనవరి 27న చోటుచేసుకున్న ఘటనలతో రీజెన్సీ సిరమిక్స్ తో పాటు రెగ్నా సిరామిక్స్, రీజెన్సీ బ్లేజెస్ లిమిటెడ్ కంపెనీలకు ఫిబ్రవరి 1న లాకౌట్ ప్రకటించారు. దీంతో 2500 మంది రెగ్యులర్ కార్మికులు, 4000 మంది డైలీ బేస్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాకౌట్ ప్రకటనతో కార్మికులకు జీతాలు అందడం లేదు. కుటుంబ పోషణార్ధం ఈ కార్మికులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలసలుపోతున్నారు. కొంతమంది సొంత ఇళ్ళను సైతం ఖాళీచేసి వలస వెళ్లిపోవడంతో అ ఇళ్ళకు తాళాలు పడ్డాయి. వీధులకు వీధులే ఖాళీ అయ్యాయి. జీతాలు లేక అద్దెలు చెల్లించలేక, పొరుగు ప్రాంతాలకు చెందినవారు ఇళ్ళు ఖాళీ చేస్తుండటంతో ఎక్కడ పడితే అక్కడ టూ లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోపక్క ఈ పరిణామాల ప్రభావం యానాంలోని ఇతర వ్యాపార సంస్థలపై కూడా పడింది. నెలరోజులుగా వ్యాపారాలు లేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక వ్యాపారాలు వాపోతున్నారు.


