TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయన సలహాతో అమరావతి ఇన్‌సైడర్ తీర్పుపై సుప్రీంకు ఏపీ సర్కార్..!  

Published on: Thu Jan 21, 2021 1:13PM

ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించే స‌మ‌యంలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్న జగన్ సర్కార్ వాద‌న‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ తీర్పుపై కోర్టులో మళ్ళీ అప్పీల్ కు వెళ్లాలని ప్రభుత్వం ఒక ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తీర్పును హైకోర్టు డివిజ‌న్ బెంచ్ లో స‌వాల్ చేయాలా…? లేక నేరుగా సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలా… అన్న అంశంపై జగన్ స‌ర్కార్ తర్జనభర్జన ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అనే పదం చ‌ట్టాల్లో లేద‌ని కోర్టు తేల్చి చెప్పినందున ఈ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని వారు భావిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు తీర్పును.. ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం అనధికారిక న్యాయసలహాదారుగా వ్యవహారిస్తున్న ఆయన అభిప్రాయం మేర‌కు… హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

2019 ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ఒక ప్రచార అస్త్రంగా వాడుకున్న వైసీపీ ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం పై ఏ క్షణమైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని చెబుతున్నారు. మరోపక్క అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేకపోతే ఇక కేసులే ఉండవని… దీంతో తాము ఇంతకాలం చేస్తున్న అమరావతిలో అవినీతి జరిగింది అనే ఆరోపణలకు విలువ ఉండదు కాబట్టి ఈ తీర్పుపై స్టే కోసం… అయితే అటు హైకోర్టు డివిజన్ బెంచ్ కి లేదంటే.. ఇటు సుప్రీంకోర్టుకు అయినా సరే వెళ్లాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.