ఒక ఆత్మహత్య 135 మంది పై ప్రభావం

ప్రతి 40సెకన్లకు ఒక ఆత్మహత్య ప్రతి మూడు సెకన్లకు ఒక ఆత్మహత్యాయత్నం

 

వార్తాపత్రిక తెరిచినా.. టీవీలో వార్తలు చూసిన ప్రతిరోజూ కామన్ గా కనిపించే వార్తల్లో ఒకటి ఆత్మహత్య. సెలబ్రేటీల నుంచి సాధారణ గృహిణి వరకు, రైతు నుంచి విద్యార్థి వరకు ఇలా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటూ తమ కుటుంబాలను అర్ధాంతరంగా విడిచివెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంటే దానివల్ల 135 మంది దాకా ప్రభావితం అవుతారని అమెరికాలో జరిగిన ఒక సర్వేలో స్పష్టమైంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఎందరినో కలచివేస్తుంది.

 

'ఆత్మహత్య మహా పాతకం' అని అభివర్ణించారు పెద్దలు. ఆత్మహత్యలకు పాల్పడే వారిని 'పిరికిపందలు' అని అభివర్ణించారు ఆధునికులు. 'ఆత్మహత్య చేసుకోవాలను కుంటే.. అంతకు ముందు ఒక ప్రజాకంటకున్ని తుదముట్టించు' అని  మహాకవి శ్రీశ్రీ సందేశం ఇచ్చారు. అన్ని దేశాలు.. ప్రాంతాలు..మతాలు.. సంస్కృతులు..జాతులు సమాజాలు.. సామూహికంగా ఎలుగెత్తి ఆత్మహత్యలు వద్దంటున్నాయి. ఈ విషయంలో చొరవ చూపిన ఐక్యరాజ్య సమితి 2003 నుంచి  సెప్టెంబర్‌ 10వ తేదీని ''ఆత్మహత్యల నివారణ దినోత్సవం''గా ప్రకటించింది.

 

ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య - ప్రతి మూడు సెకన్లకు ఆత్మహత్యాయత్నం
ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారి కన్నా.. యత్నించి విఫలమైన వారి సంఖ్య అందుకు ఇరవై రెట్లు! అంటే ప్రతి మూడు సెకన్లకు ఒక ఆత్మహత్యా యత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఆత్మహత్యలకో.. ఆత్మాహుతులకో పాల్పడే వారిలో మగవారే ఎక్కువ అయితే ఇటీవల ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు కేవలం 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కావడం విచారకరం. వ్యక్తిగత ఘర్షణలలో, హత్యల కారణంగా, యుద్ధాల కారణంగా చనిపోతున్న వారి కన్నా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని మరో సర్వేలో రుజువైంది.

 

కారణాలు..
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ప్రధాన కారణాలుగా తేల్చారు. ఆర్థిక ఇక్కట్లతో.. అప్పుల బాధతో మరణించిన వారు 22.8 శాతం, కుటుంబ సమస్యల(ఇందులోనూ ఆర్థికాంశాల)తో ఉసురుతీసుకున్న వారు 22.3 శాతం, వ్యవసాయ సంబంధ సమస్యలతో 19 శాతం, ఇతర కారణాలతో 16.3 శాతం, జబ్బుపడి 14.6 శాతం ప్రాణాలు తీసుకున్నారని కొన్ని సర్వేల లెక్కలు.

 

క్షణికావేశంలోనే
ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ క్షణంలో వారిని ఎవరైనా ఆపితే వారిలో చనిపోవాలన్న ఆలోచన మారిపోతుంది. బతుకుమీద తీపి పెరుగుతుంది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కుంటాం అన్న ధైర్యం వస్తుంది. కానీ, వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల ఆనవాళ్లు కనిపెట్టడమే కష్టం. పని ఒత్తిడి, జీవితంపై విపరీతమైన ఆశలు, చిన్నచిన్న విషయాలకే మనస్థాపానికి గురికావడం వంటి మనస్తత్వం ఉన్నవారిని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టాలి. అన్నిటికన్నా జీవితం గొప్పదన్న విషయం వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. సమస్యలను తల్లిదండ్రులు, జీవితభాగస్వామి, స్నేహితులతో పంచుకునే చనువు కల్పించాలి.  అన్నింటినీ మించి నీకు నేనున్నాను అన్న ధైర్యం సాటి మనిషి నుంచి వచ్చినప్పుడు అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలకాలన్న ఆలోచనే రాదు. ఆ ధైర్యం సమాజం నుంచి, సాటి మనిషి నుంచి రావాలి. అప్పుడే ఆత్మహత్య నివారణ దినోత్సవాలు నిర్వహించాల్సిన అవసరం రాదు.