బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు.. గంగలో కలిసిన భారత్ పరువు
Published on: Tue Jun 7, 2022 8:22AM
సెక్యులరిజం, లౌకిక వాదం, అలీన విధానం భారత్ బ్రాండ్.. విద్వేషం, పరమత అసహనం ఇప్పుడు అంతర్జాతీయంగా భారత పరువును గంగలో కలుపుతున్నాయి. మతం పేరుతో రాజకీయం చేయడం గతంలోనూ ఉంది. స్థానికంగా ఓట్లు దండుకోవడానికి కొంత మంది రాజకీయవేత్తలు గతంలో కూడా పలుమార్లు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అవి ఆ ప్రాంతానికే పరిమితమై ఉండేవి. దేశంలో మత కల్లోలాలు చెలరేగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అవి దేశానికే పరిమితమయ్యాయి.
బాబ్రీ విధ్వంసం సమయంలో, గుజరాత్ అల్లర్ల విషయంలో దేశం వణికిపోయింది. ఇంతటి రాక్షసత్వమా అని ఆవేదన చెందింది. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులూ అయోధ్యలో రామమందిరం లేకపోతేనేం.. దేశం మొత్తం గ్రామ గ్రామానా, వీధి వీధినా ఉన్నాయిగా.. చాలు హింస వద్దని అన్నారు. మైనారిటీలుగా ఉన్న ముస్లింలు కూడా బాబ్రీ మసీదు కూల్చేసినా ఫర్వాలేదు కానీ హింసాకాండ వద్దని భావించారు. భారత్ లో ఉన్న సహనం అది. భిన్నత్వంలో ఏకత్వం అది. అన్ని పండుగలూ అన్ని మతాల వారూ కలిసి జరుపుకునే సంస్కతి మనది. అయితే గత కొన్నేళ్లుగా భారత్ లో ద్వేష భావం పెచ్చరిల్లుతోంది. కొందరు నేతలు చేసే వ్యాఖ్యల వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు మంట కలుస్తోంది. అలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలు చేసే వారంతా బీజేపీ నేతలూ, సంఘ్ పరివార్ వ్యక్తులూ కావడంతో.. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా భారత్ లో మత సహనాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అధికారంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరిన తరువాత దేశంలో ఈ ధోరణి పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఇద్దరు బీజేపీ నేతలు నురూప్ శర్మ , నవీన్ కుమార్ జిందాల్ మహ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత్ పరువును గంగలో కలిపేశాయి. వారు వ్యక్తిగత స్థాయిలో ఈ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ వారిపై వేటు వేసినా భారత్ పై ఆగ్రహజ్వాలలు చల్లారలేదు.
ఆ ఇద్దరి నేతలను సమర్థిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తాయి. అదే సమయంలో బీజేపీ వారిరువురినీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ బహిష్కరణలను జనం ఒక ఫార్సుగానే భావిస్తున్నారు. గతంలో సాక్షి మహరాజ్ వంటి వారు చేసిన విద్వేష పూరిత్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇప్పటికీ సదరు నేత బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు నుపుర్ శర్మ. నవీన్ కుమార్ ల బహిష్కరణ కూడా నేను కొట్టినట్టు చేశాను.. మీరు ఏడ్చినట్లు చేయండి చందంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు.
వారి వ్యాఖ్యల ప్రభావం కొన్ని దేశాలు భారత్ ఉత్పత్తులను బహిష్కరించే వరకూ వెళ్లింది. దేశంలో ముస్లింల రక్షణకు అంతర్జాతీయ సమాజం నడుం బిగించాలనే వరకూ వెళ్లింది.చమురును భారత్ కు సరఫరా చేయకూడదన్న డిమాండ్ వరకూ వెళ్లింది. సర్వ మత సమానత్వం మా విధానం అంటూ మోడీ సర్కార్ చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం దాకా ఎందుకు దేశంలోనే అత్యధికులు నమ్మడం లేదు. సంఘ్ పరివార్ అజెండా అమలే మోడీ సర్కార్ విధానమన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నోటితో చెప్పేదొకటి.. చేతలలో చేసేదొకటిగా మోడీ సర్కార్ విధానం ఉంటున్నదని విపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీ నేత నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి. కువైత్ తమ దేశంలోని భారత దౌత్యాధికారులకు సమన్లు జారీ చేసి, పిలిపించుకుని నిరసన వ్యక్తం చేసింది. కువైత్ నగరంలోని సూపర్ మార్కెట్‌లలో భారత వస్తువుల విక్రయాలను బంద్ చేశారు. భారతీయ వస్తువులను బహిష్కరిస్తున్నామని బోర్డులు కూడా పెట్టేశారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను ముస్లింలు ఉపేక్షించరు అని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు నిరసన గళమెత్తారు. ఇప్పటికే ఖతార్, కువైత్ తమ దేశాల్లోని భారత రాయబారులకు సమన్లు జారీ చేయగా ఇరాన్ కూడా అదే దారిలో నడిచింది. భారత రాయబారిని పిలిపించుకుని, నిరసన వ్యక్తం చేసింది. భారత్ క్షమాపణకు ముస్లిం సమాజం డిమాండ్ చేస్తోంది.ఈజిప్టులోని అల్-అజర్ యూనివర్సిటీ ప్రవక్తపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమే నిజమైన ఉగ్రవాదం అని పేర్కొంది. భారత్ ను ఉగ్ర దేశంగా ప్రకటించాలనీ, లేకుంటే భారత్ మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలో పడేస్తుంది. యుద్ధాలకు దారి తీస్తుంది” అని హెచ్చరించింది.
ముస్లిం వరల్డ్ లీగ్ నురూప్ శర్మ, నవీన్ శర్మల వ్యాఖ్యలను హేయమైన చర్యగా.. విద్వేషాన్ని రెచ్చగొట్టే కుట్రగా పేర్కొంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) కూడా భారత్‌పై విమర్శలు చేసింది. ఇప్పుడు నష్టనివారణకు మోడీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు చేతులు కాలాకా అన్న చందంగా ఉన్నాయిని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలను పార్టీ నుంచి బహిష్కరించామన్న ప్రకటనతో చేతులు దులిపేసుకుంటే సరిపోదనీ, ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇష్టారీతిన మత సహనం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు ఒక అలవాటుగా మారిందని విమర్శిస్తున్నాయి. దేశంలో మసీదులన్నీ తవ్వాలంటూ ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.


