60 కోట్ల భారతీయులు రోడ్డున పడతారు... ఎందుకంటే!

 

ఇది ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్‌ చేస్తున్న హెచ్చరిక. ఇంతకీ ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు- వాతావరణంలో మార్పు! మనిషి రోజురోజుకీ ఎదిగిపోతున్నాడే కానీ వాతావరణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా భూగర్భ జలాలు పడిపోవడం, అయితే అతివృష్టి లేదా అనావృష్టి రావడం, కాలుష్యం పెరిగిపోవడం, పంటలు సరిగా పండకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు వస్తున్నాయి. వీటికి తోడు కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాల సంగతి సరేసరి.

వీటన్నింటి కారణంగా 2050 నాటికి మన దేశ జీడీపీ 2.8 శాతం తగ్గిపోయే అవకాశం ఉందంటోంది ప్రపంచ బ్యాంక్‌. దీనివల్ల తీవ్రమైన నిరుద్యోగం తలెత్తే అవకాశం ఉందట. ఇక పంటలు సరిగా పండక రైతులు, అనారోగ్యాల బారిన పడి మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరమయ్యే ప్రమాదం ఉంది. విదర్భ వంటి కొన్న ప్రాంతాల్లో అయితే తీవ్రమైన కరువు విలయతాండవం చేసే ప్రమాదం ఉందట.ఇప్పటికైనా కళ్లు తెరిచి మన చుట్టూ ఉన్న నీటి వనరులనీ, అడవులనీ, పర్యావరణాన్నీ కాపాడుకోకపోతే ఈ హెచ్చరిక నిజమై తీరుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుని ప్రజల ఆదాయంతో ముడిపెడుతూ ప్రపంచ బ్యాంక్‌ నివేదికను రూపొందించడం ఇదే మొదటిసారి.